పేదలకు ఆహార పొట్లాల పంపిణీ
రాయగడ: స్థానిక లయన్స్ క్లబ్ అపరాజిత విభాగం ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలను గుర్తించి ఆహారాన్ని అందజేశారు. సుమారు 50 మందికి ఈ సేవా కార్యక్రమాలను అందించగలిగామని క్లబ్ కార్యదర్శి బి.అవంతి తెలిపారు. క్లబ్ ఆవర్భవించిన నుంచి ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. కొత్త ఏడాదిలో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జి.రామక్రిష్ణ, ఉపాధ్యక్షులు కొరాడ రజిత, కోశాధికారి కళ్యాణి, సభ్యులు పాల్గొన్నారు.
శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న
25 బైకులు సీజ్
జయపురం: జయపురం పట్టణ పోలీసులు శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న ద్విచక్ర వాహనదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. పోలీసు ఉన్నతాధికారి ఉల్లాస చంద్రరౌత్ ఆదేశాల 26వ జాతీయ రహదారి, సర్దార్ వల్లభాయి పటేల్ మార్గం (పట్టణ మెయిన్ రోడ్డు)లో ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అధిక శబ్దంతో సృష్టిస్తున్న సైలెన్సలతో ఉన్న 25 బైకులను అదుపులోకి తీసుకొని సీజ్ చేశారు. వాటి సైలెన్సర్లను తొలగించారు. వాహనాల యజమానులకు వెయ్యి రూపాయల చొప్పున జరిమానా వసూలు చేసినట్లు పోలీసు అధికారి ఉల్లాస్ చంద్ర రౌత్ పత్రికా ప్రతినిధులకు తెలియజేశారు. పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండో సారి ఇటువంటి తప్పు చేస్తే రూ. రెండు వేలు చొప్పున ఫైన్ వేస్తామని హెచ్చరించామన్నారు. అలాగనే బైక్‌తో కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను మాత్రం వినియోగించాలని స్పష్టం చేశారు. ఇకపై రోజూ అన్ని వీధుల్లో వాహన తనిఖీలు చేపడతామన్నారు. ప్రజల సురక్షిత కోసం పోలీసు యంత్రాంగం పాడైన సైలెన్సర్‌లను వినియోగిస్తూ బైక్‌లు నడిపే వారిపై కఠిన చర్యలు చేపడతాయాని స్పష్టం చేసారు.
రూర్కెలా విమానం
దుర్ఘటనపై దర్యాప్తు
భువనేశ్వర్: ఇండియా వన్ విమానం అనివార్య ల్యాండింగ్‌తో సంభవించిన దుర్ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు గాయపడిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు విమాన సిబ్బంది కాగా 4 మంది ప్రయాణికులుగా ధ్రువీకరించారు. వారి ఆరోగ్య పరిస్థితి, చికిత్స కార్యకలాపాలను రవాణా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఉషా పాఢి ప్రత్యక్షంగా సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం వైద్య నిపుణుల బృందంతో కలిసి రూర్కెలా సందర్శించారు. ఈ విచారకర సంఘటనపై దర్యాప్తు నిర్వహించేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం ఘటనా స్థలం చేరింది. పౌర విమానయాన శాఖ మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు చురుకుగా కొనసాగుతోంది. ఈ బృందం ప్రమాద ప్రాంతంలో వైమానిక సర్వే నిర్వహించింది. ఏవియేషన్ డైరెక్టర్ రూర్కెలాలో మకాం వేశారు. డీజీసీఏ బృందం ప్రమాద స్థలాన్ని సందర్శించిందని రవాణా శాఖ ప్రముఖ కార్యదర్శి ఉషా పాఢి తెలిపారు.
అమొ బస్సు డిపోలో
అగ్ని ప్రమాదం
భువనేశ్వర్: నగరం శివార్లు పటియా స్క్వేర్ సమీపంలోని అమొ బస్ డిపోలో ఆది వారం అగ్ని ప్రమాదం జరిగింది. డిపోలో నిలిచి ఉన్న ఒక ఎలక్ట్రిక్ (ఈవీ) బస్సు ఈ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. మంటలను ఆర్పేందుకు 2 అగ్నిమాపక దళాల బృందాలను నియమించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పేదలకు ఆహార పొట్లాల పంపిణీ
పేదలకు ఆహార పొట్లాల పంపిణీ


