ఎండే అండ
భువనేశ్వర్: పునరుత్పాదక ఇంధన వినియోగంతో పర్యావరణ స్థిరత్వం కార్యాచరణలో భాగంగా మైలు రాయి ఆవిష్కృతమైంది. కటక్ జిల్లాలోని 2 గ్రామాలు రాష్ట్రంలో మొట్టమొదటి పూర్తిగా సౌరశక్తి వినియోగ ప్రాంతాలుగా వెలిశాయి. నరసింగ్‌పూర్ మండలం ఓలాబ్, కందకేల దేవభూమి గ్రామాలు పూర్తి స్థాయి సౌరశక్తి విద్యుత్తు వినియోగ ప్రాంతాలుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో తొలి సంపూర్ణ సౌర విద్యుత్ ప్రాంతాలుగా ప్రత్యేకత సంతరించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన కింద ఈ రెండు గ్రామాలు సౌర విద్యుత్ సదుపాయం పొందాయి.
కటక్ జిల్లా కలెక్టర్ దత్తాత్రేయ భౌసాహెబ్ షిండే, అఠొగొడొ సబ్ కలెక్టర్ ప్రహ్లాద్ నారాయణ్ శర్మ, టాటా పవరు సెంట్రల్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీసీఓడీఎల్) అధికారులు, ఇతర అధికారుల సమక్షంలో బొడొంబా నియోజక వర్గం ఎమ్మెల్యే బిజయ కుమార్ దలొ బెహెరా ఓలాబ్, కందకేల దేవభూమి గ్రామాల్లో సౌర విద్యుత్ శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీపీసీఓడీఎల్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ కేవలం 25 రోజుల వ్యవధిలోనే దాదాపు 80 గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లను విజయవంతంగా ఏర్పాటు చేయడం విశేషం. వీటిలో ఒలాబాలో 51, కందకేల దేవభూమిలో 29 గృహాలు ఉన్నాయి. ఈ చొరవ సాంప్రదాయ గ్రిడ్ విద్యుత్ నుండి విముక్తి కలిగించి పునరుత్పాదక సౌరశక్తి ద్వారా నిరంతరాయంగా స్వచ్ఛమైన విద్యుచ్ఛక్తిని అందిస్తుంది.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలపై దృష్టి సారించి నిరంతర విద్యుత్తు ప్రాప్యత సౌకర్యం కల్పించారు. దీంతో ఇంటి నిర్వహణ ఖర్చులను తగ్గించి ఆర్థిక భారం వెసులుబాటు కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ఉచిత విద్యుత్ పథకం కింద పైకప్పు సౌర విద్యుత్తును కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో యూనిట్‌కు రూ. 30,000 సబ్సిడీని అందించింది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 25,000 ఆర్థిక మద్దతు అందజేసింది. లబ్ధిదారుల వాటాను జిల్లా యంత్రాంగం జిల్లా ఖనిజ నిధి (డీఎంఎఫ్) నుండి నిధులను అందజేసి గ్రామస్తులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా సౌర విద్యుచ్ఛక్తి సౌకర్యం కల్పించారు. ఈ చొరవ ముఖ్యంగా బీపీఎల్ కుటుజీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. నిరంతరాయ విద్యుత్ సరఫరా విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. పునరుత్పాదక శక్తి వినియోగం పట్ల అవగాహన పెంచుతుందని ఒక సీనియర్ అధికారి తెలిపారు.
ఎండే అండ


