రైతు సమస్యలపై 13న నబరంగ్‌పూర్ జిల్లా బంద్
కొరాపుట్: ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలు (మండీ) లలో రైతుల సమస్యలపై నిరసనగా ఈ నెల 13వ తేదీన నబరంగ్‌పూర్ జిల్లా బంద్ జరగనుంది.ఆది వారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో గ్లేజ్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష బీజేడీకి చెందిన మాజీ ఎంపీ ప్రదిప్ మజ్జి ప్రసంగించారు. జిల్లాలో 10 సమితులకు గాను ఏడు సమితుల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉమ్మర్‌కోట్, రాయిఘర్, జొరిగాం సమితుల మినహా మిగతా 7 సమితుల్లో ఆందోళన ఉంటుందన్నా రు. ఆయా సమితుల్లో బీజేడీ కార్యకర్తలు రోడ్లను దిగ్బంధిస్తారని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, మాజీ జెడ్పీ ప్రెసిడెంట్ మంజులా మజ్జి, బీజేడీ నాయకులు సరోజ్ పాత్రో, అరుణ్ మిశ్ర, ప్రమోద్ పాఢీ, లల్లు త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.


