breaking news
odisha assembly
-
రాష్ట్రపతి ఒడిశా పర్యటనలో ఆసక్తికర సన్నివేశం
భువనేశ్వర్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం సొంత రాష్ట్రమైన ఒడిశాలో పర్యటించారు. శాసనసభలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆమె భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. పాత రోజులను గుర్తు చేసుకుని పులకించిపోయారు. ఒడిశా శాసనసభలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న రోజులను తలచుకున్నారు. మారు మూల గ్రామం నుంచి దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి వరకు సాగిన తన ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. శాసనసభ గ్యాలరీలో మాజీ సహోద్యోగులను చూసి సంతోషం వ్యక్తం చేశారు.తాను ఒడిశా మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో తన కార్యాలయంగా ఉన్న 11 నంబర్ చాంబర్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) సందర్శించారు. బయటకు వస్తుండగా జనసమూహం మధ్య ఉన్న వ్యక్తిని రాష్ట్రపతి పేరు పెట్టి పిలిచి, యోగక్షేమాలు అడగడంతో ఆయన అమితాశ్చర్యానికి లోనయ్యారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ తనను మర్చిపోకుండా పేరు పెట్టి పిలవడంతో తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు.మాజీ ఉద్యోగికి కుశలప్రశ్నలుఆయన పేరు అనంత చరణ్ బెహరా. రిటైర్డ్ గ్రేడ్ -4 ఉద్యోగి. ద్రౌపదీ ముర్ము ఒడిశా మంత్రిగా ఉన్న సమయంలో ఆమె కార్యాలయంలో 'జమాదార్'గా పనిచేశారు. 2000 నుంచి 2004 వరకు బీజేపీ-బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో వాణిజ్య, రవాణా మంత్రిగా ముర్ము సేవలు అందించారు. అసెంబ్లీకి ముర్ము వస్తున్నారని తెలిసి.. అనంత చరణ్ బెహరా అక్కడికి వచ్చారు. జనం మధ్యలో ఉన్న ఆయనను రాష్ట్రపతి గుర్తుపట్టారు. ''అనంతా ఎలా ఉన్నావ్? నీ కొడుకు, కూతురు ఇప్పుడు ఏం చేస్తున్నారు?" అని కుశల ప్రశ్నలు అడిగారు. "దేవుడి ఆశీస్సులతో నేను బాగానే ఉన్నాను. పిల్లల పెళ్లిళ్లు అయిపోయాయి. సర్వీసు నుంచి రిటైర్ అయ్యాను'' అని బెహరా సమాధానం ఇచ్చారు.లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్..ఇన్నేళ్ల తర్వాత కూడా రాష్ట్రపతి ముర్ము తన పేరును గుర్తుపెట్టుకుని పిలవడాన్ని లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్‌గా పేర్కొన్నారు బెహరా. తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. "మేడమ్ నోటి వెంట నా పేరు విని నేను ఆశ్చర్యపోయాను. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, మంత్రుల బృందం, అనేక మంది ఇతర వీఐపీల సమక్షంలో ఆమె నన్ను పేరు పెట్టి పిలిచారని'' ఆనందం వ్యక్తం చేశారు. తన కుటుంబం గురించి కూడా 'మేడమ్'కు తెలుసునని చెప్పారు. తన పిల్లల పెళ్లిళ్ల సమయంలో ఆమెకు ఆహ్వానం పంపించినట్టు వెల్లడించారు.ఇదీ చదవండి: మది నిండా మధుర స్మృతులే..మేడమ్ ఏం మారలేదు..ముర్ము మంత్రిగా ఉన్న సమయంలో తాను ఎంతో నమ్మకంగా పనిచేశానని చెప్పారు. "అప్పుడు, ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలు నగదు రూపంలో చెల్లించేవారు. మేడమ్ తరపున ఆమె వేతనాన్ని అకౌంట్స్ విభాగం నుంచి నేనే తెచ్చెవాడిని. నేను ఆమెకు నమ్మకమైన ఉద్యోగిని" అని తెలిపారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ ముర్ములో ఎలాంటి మార్పు లేదన్నారు. ''గత 20 ఏళ్లలో మేడమ్ ఏమాత్రం మారలేదు. ఆమె ముఖంలో అదే చిరునవ్వుతో ఇప్పటికీ మాట్లాడుతున్నారు. నాతో సహా తన ఉద్యోగులందరినీ ఎంతో ప్రేమగా చూసుకునే వారు. నేను ఆమెను చూసి గర్వపడుతున్నాను'' అంటూ అనంత చరణ్ బెహరా (Ananta Charan Behera) ప్రశంసలు కురిపించారు. -
మది నిండా పాత జ్ఞాపకాలు
భువనేశ్వర్: ఒడిశా శాసనసభలో అడుగుపెడితే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితానికి పునాది ఇక్కడే పడిందని అన్నారు. ఆమె గురువారం ఒడిశా అసెంబ్లీలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించారు. పవిత్రమైన శాసనసభలో సభ్యులంతా క్రమశిక్షణతో నడుచుకోవాలని, ప్రజలకు ఆదర్శవంతంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఒడిశా ఎమ్మెల్యేగా పనిచేసిన రోజులను ముర్ము గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ఆనాటి జ్ఞాపకాలు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మదిలోకి వస్తున్నాయని చెప్పారు. సొంతింటికి రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఒడిశా అసెంబ్లీ తనకు ఎన్నో గొప్ప పాఠాలు నేరి్పంచిందని వెల్లడించారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణంగా ఈ సభ, ఒడిశా ప్రజలు, పూరీ జగన్నాథుడి ఆశీస్సులేనని ఉద్ఘాటించారు. దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ‘‘ఎమ్మెల్యేగా ఈ సభలో మంత్రులను ప్రశ్నలు అడిగాను. అలాగే మంత్రిగా ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానాలిచ్చాను. రాష్ట్రపతి హోదాలో దేశ విదేశాల్లో ఎన్నో చట్టసభల్లో ప్రసంగించాను. కానీ, ఒడిశా అసెంబ్లీలో మాట్లాడడం నాకు మరింత ప్రత్యేకం. ఒక మారుమూల గ్రామంలో జన్మించిన నేను ఈ సభలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టాను. ఎలా మాట్లాడాలో, వేర్వేరు సందర్భాల్లో ప్రజలతో ఎలా వ్యవహరించాలో ఈ సభే నేరి్పంది. తొలిసారిగా 2000 సంవత్సరంలో ఎమ్మెల్యేగా విజయం సాధించాను. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝీ కూడా నాతోపాటే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజా ప్రతినిధులుగా మనకు దేశమే ప్రాముఖ్యం కావాలి. దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచినవారు మాటలకు, చేతలకు మధ్య సమతూకం పాటించడం నేర్చుకోవాలి. ఈ టెక్నాలజీ యుగంలో ప్రజా ప్రతినిధులను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. అందుకే సభ లోపల, బయట క్రమశిక్షణతో నడుచుకోవాలి. పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. సమాజంలోని ఆఖరి వ్యక్తికి మనం సేవలందించాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం కృషి చేయాలి’అని రాష్ట్రపతి ముర్ము విజ్ఞప్తిచేశారు. అలాగే ఒడిశా అసెంబ్లీలోని గది నెంబర్ 11ను ఆమె సందర్శించారు. ముర్ము 2000 నుంచి 2004 వరకు ఒడిశా మంత్రిగా పని చేసిన సమయంలో ఈ గదిని ఉపయోగించుకున్నారు. -
PM Narendra Modi: బీజేడీ సర్కార్.. జూన్ 4తో సమాప్తం
బరంపూర్/నబారంగ్పూర్: ఒడిశా శాస నసభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4వ తేదీన రాష్ట్రంలో బిజూజనతాదళ్ (బీజేడీ) ప్రభుత్వం అంతర్థానమవుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలయ్యాక మొదటి సారిగా ప్రధాని మోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేశారు. దేశంలోనే అగ్రరాష్ట్రంగా ఒడిశాను తీర్చిదిద్దే సదవకాశాన్ని బీజేపీకి ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. ఒరియా భాష, సంస్కృతులను అర్థంచేసుకునే ముఖ్యమంత్రే రాష్ట్రానికి అవసరమని బీజేడీ చీఫ్, సీఎం నవీన్ పట్నాయక్‌పై మోదీ విమ ర్శలు గుప్పించారు. పట్నాయక్‌కు ఒరియా భాషపై పట్టులేదని ఓ అపవాదు ఉంది. గిరిజనుల జనాభా ఎక్కువగా ఉండే నబా రంగ్‌పూర్, బరంపూర్లలో సోమవారం ఎన్నికల ర్యాలీల్లో మోదీ ప్రసంగించారు. ఎన్నికలయ్యాక డబుల్ ఇంజన్ సర్కార్‘‘మోదీ నాయకత్వంలో పదేళ్ల అభివృద్ధిని మీరు కళ్లారాచూశారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే మోదీ ప్రభుత్వం గిరిజనులకు కేటాయింపులను ఐదు రెట్లు పెంచింది. గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను 400కు పెంచాం. ఒక్క నా మంత్రిత్వశాఖలోనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉద్యోగులు 7 శాతం దాకా ఉన్నారు. బీజేడీ సర్కార్ కేంద్ర ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలుచేయని కారణంగా ఇక్కడి ప్రజలు ఆ పథక ప్రయోజనాలకు దూరమయ్యారు. జల్‌జీవన్ మిషన్ కింద ఒడిశాకు రూ.10,000 కోట్లు ఇచ్చాం. కానీ పట్నాయక్ సర్కార్ వాటిని సద్వినియోగం చేయలేదు’’ అని ఆరోపించారు.మాకు ఐదేళ్లు ఇవ్వండి‘‘ రాష్ట్రాన్ని పాలించే అవకాశాన్ని మీరు కాంగ్రెస్‌కు 50 ఏళ్లు ఇచ్చారు. బీజేడీకి 25 సంవత్సరాలు ఇచ్చారు. బీజేపీకి కేవలం ఐదు సంవత్సరాలు ఇచ్చి చూడండి. దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా ఒడిశాను తీర్చిదిద్ది చూపిస్తాం’’ అని అన్నారు. -
ఒడిశా అసెంబ్లీలో స్పీకర్ పైకి చెప్పులు
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ శనివారం రణరంగంగా మారింది. చర్చ జరపకుండా ఒడిశా లోకాయుక్త సవరణ బిల్లును సభ ఆమోదించడంపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. తమకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వని స్పీకర్ పాత్రోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోడియం వైపు చెప్పులు, కాగితం ఉండలు, మైక్రోఫోన్లను విసిరారు. దాంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని, తక్షణమే వారు సభను వీడి వెళ్లాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను, షెడ్యూల్ కన్నా ఐదు రోజుల ముందే, నిరవధికంగా వాయిదా వేశారు. మధ్యాహ్న భోజన విరామానికి ముందు, ఎలాంటి చర్చ జరపకుండానే లోకాయుక్త సవరణ బిల్లును ఆమోదించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు, మైనింగ్ కార్యకలాపాల్లో అవినీతిపై చర్చ జరపాలన్న తమ డిమాండ్‌ను స్పీకర్ తోసిపుచ్చడంతో కాంగ్రెస్ సభ్యులు కూడా వారితో జత కలిశారు. బీజేపీ సభ్యులు మైక్రోఫోన్లను లాగి, తమ ముందున్న కాగితాలను ఉండలుగా చుట్టి స్పీకర్ పోడియం వైపు విసిరారు. చివరకు స్లిప్పర్లను కూడా విసిరారు. అవి స్పీకర్ పోడియం దగ్గరలో పడ్డాయి. గందరగోళం నెలకొని, సభ అదుపు తప్పిన పరిస్థితులో స్పీకర్ పాత్రో సభను వాయిదా వేశారు. లంచ్ అనంతరం తిరిగి సమావేశమైన తరువాత, అసెంబ్లీలో బీజేపీ ఉపనాయకుడు బీసీ సేథీ, పార్టీ విప్ మోహన్ మాఝీ, ఎమ్మెల్యే జేఎన్ మిశ్రాలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం, వారు అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా జరిపారు. ఆర్థిక మంత్రి నిరంజన్ పూజారి కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టిన అనంతరం, సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఒడిశా అసెంబ్లీలో బీజేపీకి 22 మంది ఎమ్మెల్యేలున్నారు. ‘మా వాళ్లు తప్పేం చేయలేదు. మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో అలా చేశారు’ అని బీజేపీ నేత పీకే నాయక్ పేర్కొన్నారు. -
ప్రమాదంలో చనిపోయిన గాంధీ..
సాక్షి, భువనేశ్వర్ : మహాత్మా గాంధీ ఎలా చనిపోయారన్నది దేశం మెత్తం తెలుసు. గుజరాత్‌లోని సబర్మతీ తీరంలో అక్టోబర్ 30, 1948న నాథూరాం గాడ్సే చేతిలో ఆయన హత్యకు గురయ్యారు. హత్యానంతరం గాడ్సేని దోషిగా తేల్చి చట్టపరంగా ఉరి తీశారు. అయితే జాతిపిత మహాత్మా గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయారంటూ ఒడిశా విద్యా శాఖ ప్రచురించిన బుక్లెట్ తీవ్ర వివాదాస్పమైంది. దీనిపై రాజకీయ నేతలు, ఉద్యమకారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ క్షమాపణ చెప్పాలని, తప్పును వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు. గాంధీజీ హత్యను ప్రమాదంగా ప్రచురించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఈ వ్యవహారంపై ఒడిశా ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. గాంధీజీ 150వ జయంత్యుత్సవాలు నేపథ్యంలో ఆమా బాపూజీ: ఏక్ ఝలకా (మన బాపూజీ: ఒక సంగ్రహ అవలోకనం) పేరిట ప్రచురించిన ఈ రెండు పేజీల బుక్‌లెట్‌లో గాంధీకి సంబంధించిన విషయాలు వివరించారు. ఈ క్రమంలో 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయినట్లు పేర్కొన్నారు. విద్యా శాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ మాట్లాడుతూ వివాదాస్పదానికి దారితీసిన అంశం ఎలా ప్రచురితమైందనే విషయంపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే బుక్లెట్లను ఉపసంహరించుకున్నామని తెలిపారు. కాగా ఒడిశా విద్యాశాఖ రూపొందించిన బ్రోచర్లో గాంధీజీ ప్రమాదవశాత్తు చనిపోయారంటూ, చనిపోయింది ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో అని రెండు పేజీల బ్రోచర్లో పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం ఒడిశా అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని నిలదీసింది. మీరు చరిత్రను తిరగరాయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. ఈ అంశంపై అసెంబ్లీలో సీఎల్పీ లీడర్ నరసింహ్ మిశ్రా మాట్లాడుతూ.. గాంధీని నాథూరాం గాడ్సే హత్య చేశాడని, అనంతరం అతనిని ఉరి తీశారని తెలీదా? అని ప్రశ్నించారు.ఈ తప్పుకు ముఖ్యమంత్రి బాధ్యత వహించి క్షమాపణలు చెప్పాలని, ఒకవేళ ముఖ్యమంత్రికే ఇందులో భాగస్వామ్యం ఉంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గాడ్సేని బీజేపీలోని కొందరు నాయకులు దేవుడిలా భావిస్తున్నారని, ఈ ప్రభుత్వ తీరు చూస్తే బీజేడీ కూడా ఆ భావజాల ప్రభావానికి లొంగిపోయినట్టు భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని అధికార బీజేడీ సభ్యులు కూడా తీవ్రంగా ఖండించారు. చరిత్రను ఎవరూ మార్చలేరని అధికార పార్టీ సభ్యుడు సౌమ్య రంజన్ మిశ్రా స్పష్టం చేశారు. ఈ ఘటనపై శనివారం (రేపు) వివరణనివ్వాలని స్పీకర్ సూర్యనారాయణ పాత్రో ప్రభుత్వాన్ని ఆదేశించారు. -
ముస్లిం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, భువనేశ్వర్: ఒడిశా శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ముస్లిం మహిళలనుద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడారు. ముంబై, కోల్‌కతాల్లోని వేశ్యావాటికల్లో ముస్లిం మహిళలదే హవా అని అసెంబ్లీలో బీజేపీ ఉపనాయకుడు బిష్ణు సేథి వ్యాఖ్యానించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేడీ సభ్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన విషయంపై చర్చిస్తూ సేథి పై విధంగా మాట్లాడారు. దీంతో కాంగ్రెస్, అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. రికార్డులనుంచి సేథి మాటలను తొలగించాలని డిమాండ్‌చేశారు. దీంతో మళ్లీ సేథి జీరో అవర్‌లో స్పందించారు. ‘వార్తాపత్రికలు, మేగజీన్లు చేసిన సర్వేల్లో వెల్లడైన వాస్తవాలనే నేను చెబుతున్నా. సర్వే వివరాలను చెప్పడంలో తప్పేముంది. ప్రత్యేకంగా ఏ వర్గాన్నో నేను తక్కువచేసి మాట్లాడటంలేదు. ముంబై, కోల్‌కతాల్లోని రెడ్‌లైట్ ఏరియాల్లో ముస్లిం మహిళలదే హవా అని ఆయా సర్వేల ఫలితాలు వెల్లడిస్తున్నాయి’ అని అన్నారు. మైనార్టీల ఓట్ల కోసమే కొన్ని రాజకీయ పార్టీలు ట్రిఫుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని ఆయన విమర్శించారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ట్రిఫుల్ తలాక్ బిల్లును ఆమోదించిందన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా 38 దేశాల్లో ట్రిఫుల్ తలాక్‌ను రద్దు చేశారని వెల్లడించారు. ఈ బిల్లుతో మతానికి సంబంధం లేదని, సామాజిక రుగ్మతను రూపుమాపాలన్న ఉద్దేశంతోనే మోదీ సర్కారు దీన్ని ఆమోదించినట్టు ఎమ్మెల్యే బిష్ణు సేథి వివరించారు. ముస్లిం మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టడంతో సభలో గందరగోళం రేగింది. స్పీకర్ నచ్చజెప్పినా కాంగ్రెస్ సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను లంచ్ వరకు వాయిదా వేయాల్సివచ్చింది. -
ఒడిశా అసెంబ్లీలో పరిస్థితులు గందరగోళం
భువనేశ్వర్ : ఒడిశా అసెంబ్లీలో సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా నిరసనకారులపై పోలీసు ఫోర్స్ చేసిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నేటి అసెంబ్లీ సమావేశాలు అట్టుడికాయి. సుందర్ఘర్ జిల్లాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిర్వహించిన సమావేశానికి బ్లాక్ స్టోల్స్‌ను కప్పుకుని వచ్చిన మహిళా నిరసనకారుల స్టోల్స్‌ను తొలగించడానికి పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారని విపక్షాలు వాపోయాయి. ఈ గందరగోళ పరిస్థితుల నడుమ సభ పలుమార్లు వాయిదా పడింది. ఈ ఘటనపై సీఎం క్షమాపణ చెప్పాలని విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే ఈ ఘటనపై ఏ మహిళా ఇప్పటివరకు ఫిర్యాదుచేయలేదని అధికారపక్షం బీజేడీ వాదిస్తోంది. సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఈ ఘటనకు పట్నాయకే బాధ్యుడంటూ స్లోగన్స్ చేశారు. కొంతమంది కాంగ్రెస్ సభ్యులైతే ఏకంగా స్పీకర్ పోడియంపైకి ఎక్కి, మైకులను విరగొట్టారు. సభను సజావుగా సాజనిపక్షంలో స్పీకర్ నిరంజన్ పూజారీ మొదట 3 గంటల వరకు వాయిదావేశారు. తిరిగి సమావేశాలు ప్రారంభమైన తర్వాత కూడా సభలో గందరగోళం కొనసాగింది. దీంతో స్పీకర్ మరోసారి సభను వాయిదా వేశారు. మహిళలకు మంచి గౌరవం ఇస్తానని చెప్పే ముఖ్యమంత్రే, తన ర్యాలీలో ఇలాంటి ఘటనలు చేపట్టడం బాధకరమని విపక్షాల చీఫ్ విప్ తార ప్రసాద్ అన్నారు. నల్లరంగు చీరలతో వచ్చిన మహిళలను పట్నాయక్ తన మీటింగ్‌కు అనుమతించలేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. -
హీరోని బయటకు పంపించి జీరోగా..
ఒడిశా: నాలుగు రోజులు ముందుగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయడంపట్ల ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను తీవ్రంగా విమర్శించాయి. సభలో ఆయనొక సున్నా అని ఆరోపించాయి. హీరోలను బయటకు పంపించి సున్నాగా సభలో ఉండిపోయి ముఖ్యమైన అంశాలపై చర్చ లేకుండానే తప్పించుకున్నారని మండిపడ్డాయి. చిట్ ఫండ్ కుంభకోణం వంటి ఎన్నో ముఖ్యమైన అంశాలు సభలో చర్చించేందుకు ఉన్నాయని, సభను నిర్వహించాలని తాము ఎంతగా విజ్ఞప్తి చేసుకున్నా ఆ మాట పెడచెవిన ముఖ్యమంత్రి సభను వాయిదా వేయించారని ఆరోపించారు. -
అసెంబ్లీలో పోర్న్ వీడియో.. ఎమ్మెల్యే సస్పెన్షన్
భువనేశ్వర్: అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే చేసిన నిర్వాకం బయటపడింది. ఒడిశా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ కిశోర్ దాస్ తన మొబైల్ ఫోన్లో నీలిచిత్రాలు చూశారు. ఈ దృశ్యం కెమెరాలో రికార్డయింది. దీంతో అసెంబ్లీ నుంచి దాస్‌ను ఏడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో ఇంటర్నెట్ వాడిన మాట వాస్తమేనని, అయితే పోర్న్ వీడియోలను చూడలేదని దాస్ చెప్పారు. వెబ్ పేజీ ఓపెన్ చేస్తుండగా అకస్మాత్తుగా యూ ట్యూబ్‌లో పోర్న్ వీడియో ప్లే అయిందని తెలిపారు. ఇలాంటి వీడియోలను తాను ఎప్పుడూ చూడనని వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమని దాస్ చెప్పారు. కాగా ఈ వ్యవహారంపై విచారణ జరిపించి, దాస్‌పై చర్యలు తీసుకోవాలని అధికార బిజూ జనతాదళ్ సభ్యులు డిమాండ్ చేశారు. కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించిన అనంతరం దాస్‌ను సభ నుంచి సస్పెండ్ చేశారు. -
వన్ మినిట్ !
ఒడిషా శాసనసభలో వాయిదాల పర్వం ఎవరి నిరసన వారిదే భువనేశ్వర్: శాసనసభ శీతాకాల సమావేశాలు మూడో రోజైన శనివారం ఒక్క నిమిషం మాత్రమే జరిగాయి. అధికార, విపక్షాల ఆందోళనతో మూడు రోజుల నుంచి కార్యక్రమాలు నిరవధికంగా వాయిదా పడుతున్నాయి. శనివారం కూడా అదే పరిస్థితి. పైలీన్ హుద్‌హుద్ తుపానులు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినా కేంద్ర ప్రభుత్వం సాయం అందించడం లేదని, దీనిపై సభలో తీర్మానించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్, బీజేపీ సహకరించడం లేదని బీజేడీ ఆరోపిస్తోంది. చిట్‌ఫండ్ అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్, బీజేపీ ఆందోళన చేస్తున్నాయి. తనను దూషించిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రదీప్ మహారథి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా ఎమ్మెల్యే రాధారాణి పండా స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి ధర్నా చేస్తున్నారు. స్పీకర్ ప్రయత్నం విఫలం శీతాకాల సమావేశాలు మూడో రోజున ప్రారంభమైన వెంటన వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. రెండు రోజులుగా సాగుతున్న ఆందోళనపై తన చాంబర్లో చర్చించేందుకు రావాలని అఖిల పక్షాలకు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ మాటలు పూర్తికాకుండానే అధికార, విపక్ష కాంగ్రెస్ సభ్యులు బ్యానర్లతో ఆందోళన చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే రాధారాణి ధర్నా చేశారు. దీంతో స్పీకర్ ఉదయం 11.30 గంటల వరకు సభను వాయిదా వేశారు. అప్పటికీ పరిస్థితి కుదుట పడకపోవడంతో మధ్యాహ్నం 12.30కు, తర్వాత 3 గంటలకు వాయిదా వేశారు. సభ్యుల తీరు మారకపోవడంతో సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. తర్వాత 4.30 గంటలకు వాయిదా వేశారు. సరోజ్‌కు సీబీఐ పిలుపుతో... మధ్యాహ్నం 12.30 గంటలకు సభాకార్యాక్రమాలు వాయిదా వేసిన స్పీకర్, బీజేపీ మహిళా ఎమ్మెల్యేను దూషించిన అభియోగంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తర్వాత సభ సక్రమంగా సాగుతుందని అందరూ భావించారు. నవీన్ నివాస్‌లో బీజేడీ అధికారిక వ్యవహారాలను పర్యవేక్షించే సరోజ్ సాహుకు సీబీఐ కార్యాలయం నుంచి పిలుపు వచ్చిందని సమాచారం చేరడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. చిట్‌ఫండ్ అక్రమాల్లో సీఎం నవీన్, బీజేడీకి ప్రత్యక్ష సంబంధాలు తెరపూకి వస్తున్నాయని, తమ ఆరోపణ వాస్తవమని తేలుతోందని విపక్షాలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా చిట్‌ఫండ్ అక్రమాలపై సభలో నిరవధిక చర్చకు సీఎం నిరాకరించడం, స్పీకర్ అనుమతించకపోవడం సరికాదని పేర్కొన్నాయి. పరిస్థితి చేయి దాటడంతో సాయంత్రం 4.30 గంటల వరకు వాయిదా వేయడం అనివార్యమైంది. మొత్తం మీద శనివారం కేవలం ఒక్క నిముషం మాత్రమే సభా కార్యక్రమాలు జరిగాయి. అధికార పక్షమే కారణం: నర్సింగ మిశ్రా శాసన సభలో నెలకొన్న పరిస్థితులకు అధికార బిజూ జనతా దళ్ సభ్యులే కారణమని కాంగ్రెస్ శాసనసభా నాయకుడు నర్సింగ మిశ్రా ఆరోపించారు. చిట్‌ఫండ్ మోసాలపై సభలో విస్తృత చర్చకు వీలుగా ప్రశ్నోత్తరాల్ని రద్దు చేయాలని స్పీక ర్ను కోరుతుండగా, బీజేడీ సభ్యులు బ్యానర్లతో స్పీకర్ వెల్‌వైపు దూసుకువచ్చారన్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు తమదైన శైలిలో రంగంలోకి దిగినట్లు ఆయన వివరించారు. స్పీకరు విన్నపాన్ని అధికార బీజేడీ సభ్యులు పెడచెవిన పెట్టి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడం విచారకరమని వ్యాఖ్యానించారు. కాగా, నర్సింగ మిశ్రా వ్యాఖ్యల్ని బీజేడీ అధికార ప్రతినిధి సమీర్ రంజన్ దాస్ ఖండించారు. -
దేశవ్యాప్తంగా 989 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
543 లోక్‌సభ స్థానాలకు దేశవ్యాప్తంగా 989 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభంకానుంది. దేశవ్యాప్తంగా 8,251 మంది లోక్‌సభ అభ్యర్థులు బరిలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికల కౌంటింగ్ కూడా ఉదయం 8.00 గంటలకే ప్రారంభంకానుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని చర్యలు చేపట్టింది.


