మాజీ ఉద్యోగిని పేరు పెట్టి పలకరించిన రాష్ట్రపతి
యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ముర్ము
మేడమ్ కుశల ప్రశ్నలతో సంతోషంలో మాజీ ఉద్యోగి
భువనేశ్వర్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం సొంత రాష్ట్రమైన ఒడిశాలో పర్యటించారు. శాసనసభలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆమె భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. పాత రోజులను గుర్తు చేసుకుని పులకించిపోయారు. ఒడిశా శాసనసభలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న రోజులను తలచుకున్నారు. మారు మూల గ్రామం నుంచి దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి వరకు సాగిన తన ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. శాసనసభ గ్యాలరీలో మాజీ సహోద్యోగులను చూసి సంతోషం వ్యక్తం చేశారు.
తాను ఒడిశా మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో తన కార్యాలయంగా ఉన్న 11 నంబర్ చాంబర్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) సందర్శించారు. బయటకు వస్తుండగా జనసమూహం మధ్య ఉన్న వ్యక్తిని రాష్ట్రపతి పేరు పెట్టి పిలిచి, యోగక్షేమాలు అడగడంతో ఆయన అమితాశ్చర్యానికి లోనయ్యారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ తనను మర్చిపోకుండా పేరు పెట్టి పిలవడంతో తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు.
మాజీ ఉద్యోగికి కుశలప్రశ్నలు
ఆయన పేరు అనంత చరణ్ బెహరా. రిటైర్డ్ గ్రేడ్ -4 ఉద్యోగి. ద్రౌపదీ ముర్ము ఒడిశా మంత్రిగా ఉన్న సమయంలో ఆమె కార్యాలయంలో 'జమాదార్'గా పనిచేశారు. 2000 నుంచి 2004 వరకు బీజేపీ-బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో వాణిజ్య, రవాణా మంత్రిగా ముర్ము సేవలు అందించారు. అసెంబ్లీకి ముర్ము వస్తున్నారని తెలిసి.. అనంత చరణ్ బెహరా అక్కడికి వచ్చారు. జనం మధ్యలో ఉన్న ఆయనను రాష్ట్రపతి గుర్తుపట్టారు. ''అనంతా ఎలా ఉన్నావ్? నీ కొడుకు, కూతురు ఇప్పుడు ఏం చేస్తున్నారు?" అని కుశల ప్రశ్నలు అడిగారు. "దేవుడి ఆశీస్సులతో నేను బాగానే ఉన్నాను. పిల్లల పెళ్లిళ్లు అయిపోయాయి. సర్వీసు నుంచి రిటైర్ అయ్యాను'' అని బెహరా సమాధానం ఇచ్చారు.
లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్..
ఇన్నేళ్ల తర్వాత కూడా రాష్ట్రపతి ముర్ము తన పేరును గుర్తుపెట్టుకుని పిలవడాన్ని లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్‌గా పేర్కొన్నారు బెహరా. తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. "మేడమ్ నోటి వెంట నా పేరు విని నేను ఆశ్చర్యపోయాను. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, మంత్రుల బృందం, అనేక మంది ఇతర వీఐపీల సమక్షంలో ఆమె నన్ను పేరు పెట్టి పిలిచారని'' ఆనందం వ్యక్తం చేశారు. తన కుటుంబం గురించి కూడా 'మేడమ్'కు తెలుసునని చెప్పారు. తన పిల్లల పెళ్లిళ్ల సమయంలో ఆమెకు ఆహ్వానం పంపించినట్టు వెల్లడించారు.
ఇదీ చదవండి: మది నిండా మధుర స్మృతులే..
మేడమ్ ఏం మారలేదు..
ముర్ము మంత్రిగా ఉన్న సమయంలో తాను ఎంతో నమ్మకంగా పనిచేశానని చెప్పారు. "అప్పుడు, ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలు నగదు రూపంలో చెల్లించేవారు. మేడమ్ తరపున ఆమె వేతనాన్ని అకౌంట్స్ విభాగం నుంచి నేనే తెచ్చెవాడిని. నేను ఆమెకు నమ్మకమైన ఉద్యోగిని" అని తెలిపారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ ముర్ములో ఎలాంటి మార్పు లేదన్నారు. ''గత 20 ఏళ్లలో మేడమ్ ఏమాత్రం మారలేదు. ఆమె ముఖంలో అదే చిరునవ్వుతో ఇప్పటికీ మాట్లాడుతున్నారు. నాతో సహా తన ఉద్యోగులందరినీ ఎంతో ప్రేమగా చూసుకునే వారు. నేను ఆమెను చూసి గర్వపడుతున్నాను'' అంటూ అనంత చరణ్ బెహరా (Ananta Charan Behera) ప్రశంసలు కురిపించారు.


