కరాకస్: వెనెజువెలాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా వైమానిక దాడుల అనంతరం, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరస్‌లను అమెరికా ప్రత్యేక దళాలు అదుపులోకి తీసుకున్నాయి. 150 యుద్ధ విమానాలతో నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అధ్యక్షుడు నికోలస్ మదురో అందుబాటులో లేని ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో.. వెనెజువెలా సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నార్కో టెర్రరిజం (మాదకద్రవ్యాల ఉగ్రవాదం) ఆరోపణల కింద మదురో దంపతులను న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. మదురో దంపతులు తమకు లొంగిపోయారని, ప్రస్తుతం వారు అమెరికా రక్షణ విభాగం అదుపులో ఉన్నారని జనరల్ డాన్ కేన్ వెల్లడించారు.
పగ్గాలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్
వెనెజువెలా పరిపాలనా కొనసాగింపును, సార్వభౌమాధికారాన్ని కాపాడటం కోసం ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించడం తప్పనిసరి అయ్యిందని న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన 56 ఏళ్ల డెల్సీ రోడ్రిగ్జ్, నికోలస్ మదురోకు అత్యంత సన్నిహితురాలు. 1969లో కారకాస్‌లో జన్మించిన ఈమె, విప్లవ నేత జార్జ్ ఆంటోనియో రోడ్రిగ్జ్ కుమార్తె. వృత్తిరీత్యా న్యాయవాది అయిన డెల్సీ, గత దశాబ్ద కాలంలో వెనెజువెలా రాజకీయాల్లో కీలక మహిళా నేతగా పేరొందారు.
గతంలో సమాచార మంత్రిగా, విదేశాంగ మంత్రిగా సేవలందించిన డెల్సీ రోడ్రిగ్జ్ 2018 నుంచి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన సోదరుడు, నేషనల్ అసెంబ్లీ చీఫ్ జార్జ్ రోడ్రిగ్జ్‌తో కలిసి ఆమె మదురో ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. డెల్సీ రోడ్రిగ్జ్ కేవలం రాజకీయాల్లోనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపైనా పట్టు సాధించారు. 2024 ఆగస్టులో ఆమెకు చమురు శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. అమెరికా ఆంక్షల నడుమ దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ఆమె ఎంతో కృషి చేశారు.
ఇది కూడా చదవండి: వెనుజువెలాలో అప్పటి దాకా మా పాలనే.. ట్రంప్ ప్రకటన


