నటి ప్రత్యూష కేసులో ఎట్టకేలకు తుదితీర్పు వెలువడింది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని పేర్కొంది. అలానే అతడి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు విధించిన రెండున్నరేళ్ల జైలుశిక్షని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పు అనంతరం స్పందించిన ప్రత్యూష తల్లి సరోజిని దేవి.. మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే షాక్.. బ్లాక్ లిస్టులో 'ధురంధర్' నిర్మాత)
'హైకోర్డు తీర్పునే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఎక్కడున్నా సరే సిద్ధార్థ్ రెడ్డి వచ్చి లొంగిపోవాలని తీర్పులో పేర్కొన్నారు. రెండున్నరేళ్లని ఖరారు చేశారని అనుకుంటున్నాను. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తున్నాను. కానీ నాకు న్యాయం జరగలేదేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే నా కూతురిపై అత్యాచారం జరిగిందని నేను నమ్ముతున్నా. చంపేశారని కూడా నమ్ముతున్నా. నా కూతురు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఎవరేం చెప్పినా ఈ రెండింటి గురించి వేరేది నమ్మే పరిస్థితిలో లేను'
'నా బిడ్డకు నిజమైన న్యాయం మాత్రం దక్కలేదు. సిద్ధార్థ్ రెడ్డికి జీవిత ఖైదు పడాలని నేను మొదటి నుంచి పోరాటం చేస్తున్నాను. నాది సుప్రీంకోర్టులో 14 ఏళ్ల పోరాటం. 2011 నుంచి పోరాడుతూనే ఉన్నాను. హైకోర్టులో ఇచ్చిన రెండున్నరేళ్ల శిక్షని.. ఇక్కడ రెట్టింపు చేస్తారని భావించాను. కానీ సుప్రీం ఇచ్చిన తీర్పు తర్వాత నా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. నాకు సంపూర్ణమైన న్యాయం జరగలేదు. నా బిడ్డ ఆత్మకు శాంతి కలగదలేదని అనుకుంటున్నాను' అని సరోజిని దేవి చెప్పుకొచ్చారు.
ప్రత్యూష ఎవరనేది ఇప్పటి జనరేషన్‌కి తెలియకపోవచ్చు గానీ 90స్ ప్రేక్షకులని అడిగితే చెప్తారు. తెలుగులో పలు సినిమాలు చేసిన ఈమె.. కెరీర్ పరంగా పీక్ స్టేజీలో ఉన్నప్పుడు తన ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అయిన సిద్ధార్థ్ రెడ్డితో ప్రేమలో పడింది. సిద్ధార్థ్ కుటుంబం.. ఈ ప్రేమని అంగీకరించకపోవడంతో వీళ్లిద్దరూ 2002 ఫిబ్రవరి 23న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ప్రత్యూష చనిపోగా.. సిద్ధార్థ్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ప్రత్యూషని ఆత్మహత్యకు ప్రేరేపించాడని చెప్పి సిద్ధార్థ్ రెడ్డికి తొలుత ఐదేళ్ల జైలుశిక్ష పడింది. అయితే 2011లో ఈ శిక్షని రెండేళ్లకు తగ్గించింది హైకోర్టు.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)


