
ఇవి కొరకరాని గింజలు. కొయ్య కంటే గట్టిగా ఉండే గింజలు. అలాగని, ఆషామాషీగా తీసిపారేసే గింజలు కావివి. వీటిని ఏనుగు దంతాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. దక్షిణ అమెరికాలో పెరిగే ‘టాగ్వా’ అనే తాటిజాతి వృక్షాలకు కాసే కాయల్లో ఇవి దొరుకుతాయి. ఈ గింజలను ‘టాగ్వా నట్స్’ అంటారు. ఇవి పోకచెక్కల కంటే గట్టిగా ఉంటాయి.
కాబట్టి ఈ కొరకరాని గింజలను ఎవరూ తినలేరు. ఏనుగుదంతంలా నునుపుగా, దృఢంగా ఉండటం వల్ల వీటిని ‘వెజిటబుల్ ఐవరీ’ అంటారు. ఏనుగు దంతాలతో తయారు చేసేలాగానే వీటితో కూడా రకరకాల బొమ్మలను, పూసలు తదితర అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. పద్దెనిమిదో శతాబ్దంలో వీటితో తయారు చేసే గుండీలకు చాలా గిరాకీ ఉండేది.
మన్నికకు పేరుపొందిన ఈ గుండీలతో కుట్టించుకున్న దుస్తులను సంపన్నులు ధరించేవారు. పురాతన కాలంలో వీటితో పాచికలను తయారు చేసేవారు. ఇటీవలి కాలంలో వీటిని పొగతాగడానికి ఉపయోగించే పైపులు, చదరంగం బొమ్మలు, కొయ్యబొమ్మల్లాంటి శిల్పాలు, వీటి పూసలతో హారాలు మొదలైన వాటి తయారీకి కూడా ఉపయోగిస్తున్నారు.
(చదవండి: కోవిడ్–19’తో మహిళల్లో ఆ సమస్య..!)