
ప్లాస్టిక్ భూతం అంటూ గగ్గోలు పెడుతున్నారు పర్యావరణ వేత్తలు. అన్నింటిలో ప్లాస్టిక్ ఆవరించేసిందంటూ పెద్ద పెద్ద లెక్చర్లు ఇవ్వడమే తప్ప, నిర్మూలించే దిశగా అడుగులు పడవు. కానీ ఈ మహిళలు..ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుతో ప్లాస్టిక్‌ని నాటి సంప్రదాయం తిరిగి పురుడుపోసుకునేలా చెక్‌పెట్టేందుకు నాంది పలికారు. సాదికారతకు బీజం వేసేలా సంప్రదాయం, పర్యావరణ హిత సమ్మిళితంగా సాగిపోతున్న వారి దృఢ సంకల్పానికి హ్యాట్సాఫ్ అని చెప్పాల్సిందే.
ఇదంతా చెన్నైలో చోటుచేసుకున్న అద్భుత చైతన్యంగా పేర్కొనవచ్చు. చెన్నై అనగానే మెరీనా బీచ్, ఆవిరి ఫిల్టర్ కాఫీ, పురాతన దేవాలయాలే కాదు..వినూత్న పద్ధతిలో ప్లాస్టిక్‌కి చెక్‌పెడుతున్న ఈ మహిళలు కూడా ఇప్పుడు ఠక్కున గుర్తొస్తారు. ఎందుకంటే వీళ్లు చేస్తున్న సాధికారతతో కూడిన పర్యావణ హిత ఉద్యమం యావత్తు దేశాన్ని ఆకర్షించేలా హైలెట్‌గా నిలిచింది. చేస్తున్న ప్రయత్నం చిన్నదైనా..ప్రభావం మాములుగా లేదు అనిపించుకున్నారు ఈ వనితలు.
తమిళనాడు ప్రభుత్వం పర్యావరణ అనుకూల ప్రాజెక్టులో భాగంగా మహిళా సంఘాలకు ఆకుపచ్చని ఎలక్ట్రిక్ ఆటోలు అందించి సాధికారత, సంప్రదాయాన్ని మిళితం చేసేలా పర్యావరణ హితంగా నడిపిస్తోంది. వీరంతా ఆకుపచ్చ మొబైల్ ఆటోల్లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనోపాధినే కాదు, పర్యావరణ సంరక్షణ కోసం తమ వంతు తోడ్పాటును అందిస్తూ..ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
వాళ్లు ఈ మొబైల్ ఆటోల సాయంతో తాజా కూరగాయలను కస్టమర్లకు చేరవేయడమే కాదు, వాటిని పసుపు పచ్చ బ్యాగుల్లోనే కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. పాతకాలం నాటి పసుపురంగు కాటన్ సంచులకు ప్రాణం పోసి నాటి సంప్రదాయన్ని గుర్తుచేయడమే కాదు..పర్యావరణ సంరక్షణకు బాటలు వేస్తున్నారు. అంతేగాదు కేవలం కూరగాయలు అమ్మడమే కాదు, ఈ ప్లాస్టిక్ భూతం మన జీవితాన్ని ఎలా కబిళిస్తుంది, ఎలా మన జీవితాల్లో స్థిరపడిపోయిందో వివరిస్తూ..ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఈ చెన్నై మహిళలు.
ఆకుపచ్చని ఆటోలతో పచ్చదన సంరక్షణ నినాదం తోపాటు తిరిగి ఉపయోగించే ఈ పర్యావరణ హిత పసుపు సంచులనే వాడుదాం అని విషయాన్ని ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేస్తున్నారు. అందుకే ఈ సంచులను తమిళంలో మంజపైస్(మళ్లీ వినియోగించే పసుపు సంచులు) అని పిలుస్తారు. ఇక ఈ ఆటోలు కూడా కాలుష్య రహిత ఎలక్ట్రానిక్ వాహనాలే కావడం విశేషం.
మొత్తం ఈ ప్రాజెక్టు కార్యచరణ మొత్త పర్యావరణ సంరక్షణకే పెద్దపీట వేసేలా జాగ్రత్త తీసుకుని స్త్రీ సాధికారతను ప్రోత్సహించి..అందిరిచే ప్రశంలందుకుంది అక్కడి ప్రభుత్వం. ఇది ఒకపక్క జీవనోపాధి, మరోవైపు సాధికారణ, సంప్రదాయ మిళిత పర్యావరణ హితానికి అంకురార్పణ చేయడమే గాక పెనుమార్పుకి నాంది పలికింది కదూ..!.
(చదవండి: భారత్ పిలిచింది..! కష్టం అంటే కామ్ అయిపోమని కాదు..)