చమురు నౌకల అడ్డగింత దేశాన్నే దిగ్బంధిస్తామని హెచ్చరిక
చమురు క్షేత్రాలు, భూములు, ఆస్తులు తమవేనని ప్రకటన
ఐరాసకు ఫిర్యాదు చేస్తాం: వెనిజులా
వాషింగ్టన్: దక్షిణ అమెరికా దేశం వెనిజులాలోని అపార చమురు నిల్వలపై కన్నేసిన ట్రంప్, వాటిని ఎలాగైనా చేజిక్కించుకునే ప్రయత్నాలకు మరింత పదును పెడుతున్నారు. అందులో భాగంగా ఆ దేశానికి చమురు నౌకల రాకపోకలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. సాగర జలాల్లో భారీగా నేవీ, సైన్యాన్ని మొహరించి ప్రతి చమురు నౌకనూ అడ్డుకుని తీరుతామని సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ఖాతాలో మంగళవారం ఆయన పోస్ట్ పెట్టారు.
‘వెనిజులాను అన్నివైపుల నుంచి దిగ్బంధించాం. కనీవినీ ఎరగనంతటి సంఖ్యలో సైన్యం ఆ దేశాన్ని చుట్టుముట్టనుంది. వెనిజులా చమురు విక్రయ సొమ్మంతా అమెరికాలోకి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటివాటికే ఉపయోగపడుతోంది. ఇది మా దేశ భద్రతకే సవాలుగా మారింది. అందుకే ఈ దిగ్బంధం. న్యాయబద్ధంగా అమెరికాకు చెందాల్సిన వెనిజులాలోని అపార చమురు నిల్వలు, భూములు, ఆస్తులు అన్నింటినీ మాకు అప్పగించేదాకా వదలం’ అని స్పష్టం చేశారు.
గత నెలలో కూడా వెనిజులా తీర సమీపంలో ఆ దేశ చమురు నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ట్రంప్ తీరుపై వెనిజులా మండిపడింది. ‘ఒక సార్వభౌమ దేశంలోని ఆస్తులు, చమురు క్షేత్రాలు తమావేవని అంటారా? అంతర్జాతీయ చట్టాలను, స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలను ట్రంప్ తుంగలో తొక్కుతున్నారు. దీనిపై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేస్తాం’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
ట్రంప్ అసలు ఉద్దేశం డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కట్టడి కాదని స్వయానా ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్ స్పష్టం చేశారు. మాట వినని ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దింపడమేనని ఆయన అసలు లక్ష్యమని కుండబద్దలు కొట్టారు! ఈ మేరకు వానిటీ ఫెయిర్ వైల్స్‌కు ఇచ్చిన సంచలనాత్మక ఇంటర్వ్యూ మంగళవారం ప్రచురితమైంది. మదురో కాళ్ళబేరానికి వచ్చి తప్పుకునేదాకా వెనిజులా చమురు నౌకలను పేల్చేస్తూనే ఉంటామని కూడా ఆయన స్పష్టం చేయడం విశేషం! వెనిజులాలో ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వకున్న విషయం తెలిసిందే. ఆ దేశం ఏకంగా రోజుకు 10 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తుంది. అక్కడి ఆర్థిక వ్యవస్థకు చమురు ఆదాయమే జీవనాడి.


