ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. మరొకటి వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక శక్తి. వ్యూహాత్మకంగా చూస్తే ఇద్దరిదీ విడదీయరాని బంధం. కానీ, వ్యాపారం విషయానికి వస్తే మాత్రం నువ్వా-నేనా అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారత్-అమెరికా మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. అయితే ప్రతిసారీ చర్చలు కొలిక్కి వచ్చే సమయానికి ఏదో ఒక అడ్డంకి పలకరిస్తూనే ఉంది.
అమెరికా విధిస్తున్న కఠినమైన టారిఫ్ రూల్స్ ఒకవైపు, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని వాషింగ్టన్ జీర్ణించుకోలేకపోవడం మరోవైపు.. ఈ రెండింటి మధ్య ట్రేడ్ డీల్ దోబూచులాడుతోంది. అసలు ఈ రెండు దేశాల మధ్య ఉన్న పేచీ ఎక్కడ? అగ్రరాజ్యం ఆంక్షల నడుమ భారత్ తన ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటోంది? ఈ ప్రతిష్టంభనకు గల కారణాలపై ప్రత్యేక విశ్లేషణ..
టారిఫ్ యుద్ధం.. అమెరికా అభ్యంతరం
భారత మార్కెట్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు కలిగిన మార్కెట్లలో ఒకటి అని అమెరికా వాదిస్తుంది. ముఖ్యంగా హార్లే డేవిడ్‌సన్ వంటి బైకులు, ఐటీ, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న పన్నులను తగ్గించాలని కోరుతోంది.
భారత్ వాదన
భారత్ తన దేశీయ పరిశ్రమలను (Make in India) కాపాడుకోవడానికి ఈ పన్నులు అవసరమని చెబుతోంది. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో భారత్‌ను ‘టారిఫ్ కింగ్’ అని పిలవడం, ప్రస్తుతం మళ్లీ అధికారం చేపట్టాక అదే ధోరణి కొనసాగుతోంది.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. అయితే భారత్ తన ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి రాయితీపై చమురు కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఇది అమెరికాలోని కొందరు రాజకీయ నాయకులకు నచ్చలేదు. రష్యాకు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నారని అమెరికా భావిస్తుండగా భారత్ తన స్ట్రాటజిక్ అటానమీ(వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి) వైఖరిని స్పష్టం చేసింది. ఈ భౌగోళిక రాజకీయ భేదాభిప్రాయాలు వాణిజ్య చర్చలపై ప్రభావం చూపుతున్నాయి.
జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (GSP) హోదా
గతంలో అమెరికా భారత్‌కు జీఎస్‌పీ హోదా ఇచ్చేది. దీని ద్వారా కొన్ని భారతీయ ఉత్పత్తులు సుంకం లేకుండానే అమెరికాలోకి ప్రవేశించేవి. ట్రంప్ మొదటి హయాంలో ఈ హోదాను రద్దు చేశారు. దీన్ని పునరుద్ధరించాలని భారత్ పట్టుబడుతుండగా, అమెరికా మాత్రం భారత మార్కెట్లలో తమ డెయిరీ, మెడికల్ డివైజ్‌లకు(Stents etc..) మరింత వెసులుబాటు ఇస్తేనే ఆలోచిస్తామని అంటోంది.
డేటా గోప్యత, ఈ-కామర్స్ విధానాలు
అమెరికన్ దిగ్గజాలైన అమెజాన్, వాల్‌మార్ట్ (ఫ్లిప్‌కార్ట్), గూగుల్ వంటి కంపెనీలు భారత మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. భారత్ తీసుకొస్తున్న డేటా లోకలైజేషన్(భారతీయ వినియోగదారుల సమాచారం ఇక్కడే ఉండాలి), ఈ-కామర్స్ నిబంధనలు అమెరికాకు ఇబ్బందికరంగా మారాయి. తమ కంపెనీలకు భారత్ ‘లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్’(పోటీలో ఉన్న అందరికీ సమాన అవకాశాలు కల్పించడం) కల్పించడం లేదని అమెరికా వాణిజ్య శాఖ తరచుగా ఆరోపిస్తోంది.
ఫార్మా రంగంలో..
అమెరికన్ ఫార్మా కంపెనీలు తమ మందుల పేటెంట్ హక్కుల విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. తక్కువ ధరకే జనరిక్ మందులను ఉత్పత్తి చేసే భారత విధానం తమ లాభాలను దెబ్బతీస్తోందని వారి వాదన.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా భారత్‌తో ట్రేడ్ డీల్‌ను వ్యూహాత్మకంగా వాయిదా వేస్తున్నారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. 2025లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు, ట్రంప్ శైలిని పరిశీలిస్తే దీని వెనుక ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.
ప్రతికార సుంకాలు
భారత్ అమెరికా వస్తువులపై ఎంత పన్ను విధిస్తుందో, అమెరికా కూడా భారత వస్తువులపై అంతే పన్ను విధించాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. దాంతో 2025 ఆగస్టులో భారత్ నుంచి వచ్చే ఎగుమతులపై ట్రంప్ ప్రభుత్వం 25% రెసిప్రోకల్ సుంకాన్ని విధించింది. భారత్ తన వైపు నుంచి పన్నులు తగ్గించే వరకు ఈ డీల్‌పై సంతకం చేయకూడదనేది ఆయన ఉద్దేశం.
క్రూడాయిల్.. ఎస్-400 పేచీ
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ రష్యా నుంచి ముడి చమురు, రక్షణ పరికరాలను (S-400 వంటివి) కొనుగోలు చేయడం ట్రంప్‌నకు నచ్చడంలేదు. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్నందుకు భారత్‌పై అదనంగా మరో 25% పెనాల్టీ సుంకాన్ని విధించారు. అంటే ప్రస్తుతం కొన్ని భారతీయ ఉత్పత్తులపై మొత్తం 50% సుంకం అమలవుతోంది. భారత్ తన విదేశాంగ విధానాన్ని మార్చుకునేలా ఒత్తిడి తేవడానికి ఈ డీల్‌ను ఒక ఆయుధంగా వాడుతున్నారు.
అమెరికా రైతుల ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్ పనిచేస్తున్నారు. అమెరికా నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఆయన కోరుతున్నారు. ఇటీవల భారతీయ బియ్యం ఎగుమతులపై కూడా ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తూ అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. భారత రైతుల ప్రయోజనాల దృష్ట్యా మన ప్రభుత్వం దీనికి సుముఖంగా లేదు. దీంతో చర్చలు నిలిచిపోయాయి.
వ్యక్తిగత ప్రతిష్ఠ, మధ్యవర్తిత్వం
కొన్ని విశ్లేషణల ప్రకారం (ఉదాహరణకు: జెఫరీస్ గ్రూప్ నివేదిక), భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో తాను మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. కానీ భారత్ దాన్ని సున్నితంగా తిరస్కరించడం ఆయనకు నచ్చలేదని, ఆ అసహనం కూడా వాణిజ్య చర్చల జాప్యానికి ఒక కారణమని భావిస్తున్నారు. ట్రంప్ తన మద్దతుదారులకు (MAGA - Make America Great Again) తాను ఇతర దేశాలతో వాణిజ్యం పరంగా ఒక కఠినమైన బేరసారాలాడే వ్యక్తి(Tough Negotiator) అని నిరూపించుకోవాలి. భారత్‌తో అరకొర ఒప్పందం చేసుకుంటే అది తన రాజకీయ ఇమేజ్‌కు దెబ్బని ఆయన భావిస్తున్నారు. భారత్ నుంచి భారీగా రాయితీలు పొందితేనే అది తనకు రాజకీయంగా విజయం అని ఆయన నమ్ముతున్నారు.
ప్రస్తుత పరిస్థితి
ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు పూర్తిగా ఆగిపోలేదు. ఇటీవల కూడా అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం భారత్‌లో పర్యటించింది. అమెరికా పట్టుబడుతున్న మొక్కజొన్న (Corn), సోయా వంటి ఉత్పత్తులను భారత్‌లోకి అనుమతించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇరు దేశాలు ఈ విషయంలో ఒక అంగీకారానికి వస్తే 2026 ప్రారంభంలో ఈ సుంకాలు తగ్గే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూ కోటీశ్వరులు కావాలంటే..


