ఏఐ జోష్‌ ఎలా బాస్‌! | Employee working hour changes in 2026 | Sakshi
Sakshi News home page

ఏఐ జోష్‌ ఎలా బాస్‌!

Dec 31 2025 2:56 AM | Updated on Dec 31 2025 2:56 AM

Employee working hour changes in 2026

కాలంతోపాటు ఉద్యోగుల పనితీరూ మారుతుంటుంది. ఆ పనితీరు ఎలా ఉండబోతుందనేదే అసలు సిసలు ప్రశ్న! ఇంతకీ 2026లో ఎలా ఉండబోతోంది? ‘ కంపెనీ అంటే ఏ.ఐ. మాత్రమే... ఉద్యోగులు నామమాత్రమే!’ అన్నట్లుగా ఉండబోతుందా? ‘ఏ.ఐ. తాతలు దిగివచ్చినా ఉద్యోగి ఉద్యోగే’ అన్నట్లుగా ఉండబోతుందా? ‘ఎట్‌ లీస్ట్‌ 70 అవర్స్‌ ఏ వీక్‌’ అంటున్నారు నారాయణమూర్తి.

‘ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు... వారానికి ఆరురోజులు మాత్రమే’ అంటున్నారు ఆలీబాబా ఫౌండర్‌ జాక్‌ మా. ఈ పెద్దల ప్రతిపాదనలు ఉద్యోగులకు నచ్చాయా? పనితీరును, ఉత్పాదకతను మెరుగుపరుచుకోవడం నుంచి ఉద్యోగానికి ఆవలి ప్రపంచాన్ని ఆస్వాదించడం వరకు  కొత్త సంవత్సరంలో వచ్చే మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం...

భవిష్యత్‌లో ఉద్యోగుల పనితీరు ఎలా ఉండబోతుంది? కంపెనీలకు మాత్రమే మేలు చేసేలా ఉంటుందా? ఉద్యోగులకు మాత్రమే మేలు చేసేలా ఉంటుందా? సాంకేతికతే సర్వస్వం అన్నట్లుగా ఉంటుందా? నైతిక విలువలకు, స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు చోటు ఉంటుందా? నిపుణులు చెప్పే సమాధానం మాత్రం ఇది.... ‘ఎంతమాత్రం ఏకపక్షం కాబోదు. కంపెనీకి, ఉద్యోగులకు పరస్పర ప్రయోజనకరంగానే ఉంటుంది’

⇒ జీవనోత్సాహ ఉద్యోగం
గతంతోపోలిస్తే... ‘ఏదో ఒక ఉద్యోగం లే’ అని సరిపెట్టుకోవడం లేదు యువత. ‘ఈ ఉద్యోగం నా కెరీర్‌కు ఏ మేరకు ఉపయోగపడుతుంది?’ అనే కోణంలో విశ్లేషించుకుంటున్నారు. ‘ఉద్యోగం అనేది జీవితాన్ని నిర్వీర్యం చేసేది కాదు, జీవనోత్సాహాన్ని ఇచ్చేది’ అనే ఎరుకతో జాగ్రత్తగా ఉద్యోగాలు ఎంచుకుంటున్నారు. ‘చాలామంది ఉద్యోగులు తమ కెరీర్‌లో ఉన్నతిని కోరుకుంటున్నప్పటికీ, ఉద్యోగ జీవితానికి ఆవలి ప్రపంచాన్ని కూడా ఆస్వాదించాలనుకుంటున్నారు’ అంటున్నారు ముంబైకి చెందిన వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌ కోచ్‌ భక్తి తలాటీ. వ్యక్తిగత జీవితానికి సమయం లేకపోతే...భారీ జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదిలి, వ్యక్తిగత స్చేచ్ఛకు అవకాశం ఇచ్చే చిన్న ఉద్యోగాల్లో సైతం చేరేవారి సంఖ్య తక్కువేమీ కాదు. అయితే పనిగంటలకు సంబంధించి నారాయణమూర్తి, జాక్‌ మా ప్రతిపాదనలతో ఏకీభవించే వారితోపాటు తీవ్రంగా విభేదించే వారు కూడా యువతరంలో ఉన్నారు.

ఇప్పుడు కావాలి...  ఆరోగ్యకరమైన పనితీరు
‘ఆరోగ్యకరమైన పనితీరు’కుప్రాధాన్యత పెరుగుతోంది. ఆరోగ్యకరమైన పనితీరుకు సంబంధించి తమ సీనియర్‌ల నుంచి నేర్చుకోవడానికి మిలీనియల్స్‌ ఆసక్తి చూపుతున్నారు. 2026లో... కంపెనీలలో భారీ జీతానికి ప్రతిభ, శ్రమ మాత్రమే తప్పనిసరి కొలమానం కాబోతోంది. ప్రతిభ కనబరిచే ఉద్యోగులను త్వరగా పై స్థాయికి తీసుకువెళ్లడం, ఉద్యోగులకు అనుకూలమైన లీవ్‌ పాలసీలు, అనుకూలమైన పనిగంటలు...మొదలైనవి కంపెనీల ప్రాధాన్యత జాబితాలో చేరనున్నాయి.

⇒ అది ట్రెండ్‌ మాత్రమే కాదు...
‘ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ మోడల్‌... మైక్రోషిఫ్టింగ్‌ అనేది కేవలం ఫ్లెక్సిబిలిటీ ట్రెండ్‌ మాత్రమే కాదు. పనితీరును సరిగా అర్థం చేసుకొని, మెరుగైన పనితీరును కనబరచడం’ అంటున్నారు జెన్‌ జడ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘అన్‌స్టాప్‌’ ఫౌండర్, సీఈఓ అంకిత్‌ అగర్వాల్‌. మరి ఏ.ఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) మాటేమిటి? చాలామంది అనుకున్నట్లు ఉద్యోగాలుపోతాయా? ఎటు చూసినా ‘ఏ.ఐ. మాత్రమే’ అన్నట్లుగా ఉండబోతోందా అంటే– కాదనే అంటున్నారు అగర్వాల్‌.

‘ఏ.ఐ. అనేది ఉద్యోగులు తమను తాము మెరుగుపరుచుకునేలా చేస్తుంది. మరిన్ని పనులు చేసేలా చేస్తుంది. షెడ్యూలింగ్, డాక్యుమెంటేషన్, రిసెర్చ్‌... మొదలైనవాటికి సంబంధించి మరింత లోతుగా ఆలోచించే అవకాశం ఉద్యోగులకు దొరుకుతుంది. క్రియేటివిటీ థింకింగ్‌కు సంబంధించి మనిషిని యంత్రం అనుకరించలేదు’ అంటున్నారు అగర్వాల్‌.

⇒ సిద్ధం కావాల్సిందే!
సరికొత్త సాంకేతికత సరికొత్త పనితీరుకు కారణం అవుతుంది. ‘ఇంటెలిజెంట్‌ సిస్టమ్స్‌తో కలిసి పనిచేయడానికి ప్రతి ఉద్యోగి సిద్ధం కావాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఏ.ఐ. అంటే బెదిరిపోవడం కాదు, ఏ.ఐ.తో కలిసి ఆలోచించేలా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి’ అంటున్నారు సాప్‌ ల్యాబ్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సింధు గంగాధరన్‌.

ఏడీపీ... ఇలా చెబుతోంది...
2026లో పని ప్రదేశాలు ఎలా ఉండబోతున్నాయి? ఉద్యోగులపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రభావం ఎంత? ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు... మొదలైన విషయాలపై లీడింగ్‌ గ్లోబల్‌ టెక్నాలజీ కంపెనీ ‘ఏడీపీ’ ఒక నివేదిక రూపొందించింది. ‘కొత్త సంవత్సరంలో ఉద్యోగుల ముందు అవకాశాలతోపాటు సవాళ్లు కూడా ఉంటాయి. స్కిల్‌ అనేది సరికొత్త కరెన్సీగా మారనుంది. యాంత్రీకరణ అనేది ఉద్యోగుల పనితీరును మార్చబోతుంది.

ప్రోడక్టివిటీకి ఉపయోగపడే, వ్యక్తిగత జీవితానికి భారం కాని పనితీరుకు ఉద్యోగులుప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటున్నారు ఏడీపీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ గోయల్‌. ‘ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి మెంటల్‌ హెల్త్‌ కౌన్సెలింగ్, ఫైనాన్షియల్‌ప్లానింగ్, కేర్‌గీవింగ్‌ రిసోర్సెస్, స్ట్రెస్‌మేనేజ్‌మెంట్‌లాంటి వాటిపై నిర్మాణాత్మక కార్యక్రమాలు మరింతగా విస్తరించనున్నాయి. చాలా కంపెనీలు, చిన్న పట్టణాలలో నుంచి ప్రతిభావంతులైన ఉద్యోగులను ఎంచుకోవడానికి హబ్‌–అండ్‌–స్పోక్‌ అ్రపోచ్‌ను అనుసరిస్తున్నాయి’ అని ఏడీపీ సర్వే రిపోర్ట్‌ చెబుతుంది.

హైబ్రీడ్‌ క్రీప్‌–2026
‘గతంతోపోల్చితే ఇంటినుంచి పనిచేసే వారి కంటే ఆఫీస్‌కు వచ్చి పనిచేసే ఉద్యోగుల సంఖ్య కొత్త సంవత్సరంలో పెరగనుంది. హైబ్రీడ్‌ క్రీప్‌ (క్రమంగా పెరుగుతున్న ఇన్‌–ఆఫీస్‌ రోజుల సంఖ్య) తీవ్రతరం అవుతుంది’ అంటున్నారు వోల్‌ ల్యాబ్స్‌ సీఈఓప్రాంక్‌ విషాఫ్ట్‌. ‘ఇంటి నుంచి పని చేసినా ఫరవాలేదు. ఆఫీస్‌ నుంచి పనిచేసినా ఫరవాలేదు’ అనే వెసులుబాటు ఉద్యోగులకు ఉండేది. ఇప్పుడు మాత్రం ‘ఆఫీసు నుంచి పనిచేయక తప్పదు’ అనే ధోరణి పెరిగింది.

నైపుణ్యమే అసలు సిసలు డిగ్రీ
‘ఉద్యోగానికి కాలేజీ డిగ్రీ మాత్రమే ప్రధానం’ అనే నిబంధన రాబోయే రోజుల్లో మరింతగా సడలిపోనుంది. ‘స్కిల్‌–ఫస్ట్‌ రెవల్యూషన్‌’లో డిగ్రీల కంటే నైపుణ్యానికేప్రాధాన్యత పెరగనుంది. కంపెనీలకు సంబంధించి ఆన్‌–ది–జాబ్‌ బూట్‌క్యాంప్స్‌ స్టాండర్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కానున్నాయి. ‘డిగ్రీ ఆధారిత ఉద్యోగ నియామకాల కంటే, నైపుణ్యాల ఆధారిత ఉద్యోగ నియామకాల ధోరణి 2026 ఊపందుకుంటుంది.అలా అని డిగ్రీ ఉన్న వాళ్లప్రాధాన్యత ఏమీ తగ్గదు’ అంటున్నారు అమెరికాలోని నేషనల్‌ యూనివర్శిటీలో వర్క్‌ఫోర్స్‌ అండ్‌ కమ్యూనిటీ ఎడ్యుకేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ క్రిస్‌ గ్రాహం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement