
మాది ‘జీరో కాస్ట్ ఆఫ్ లివింగ్’ అంటారు కావ్య, సంగీత్ దంపతులు. ఈ మాట చాలామందికి కొత్త, వింత. కొందరైతే ‘ఈ దంపతులకు మతి చెడింది’ అని గుసగుసగా అనుకొని ‘స్టుపిడ్ కపుల్’ అని నామకరణం చేశారు. అయితే కావ్య, సంగీత్‌ల జీవనశైలిని వివరంగా తెలుసుకున్నాక మాత్రం వారిని అభినందించకుండా ఉండలేకపోయారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలనుకున్నారు.
ఇంతకీ ఏమిటీ జీరో కాస్ట్ ఆఫ్ లివింగ్? కావ్య, సంగీత్ దంపతులు కట్టుకున్న ఇంటి పేరు... జీరో కాస్ట్ ఆఫ్ లివింగ్! ఇది ఇంటిపేరు మాత్రమే కాదు...వారి ఆదర్శవంతమైన జీవనశైలిని సూచించే పేరు. స్వయం సమృద్ధిగా తమ ఇంటిని తీర్చిదిద్దుకున్నారు. కూరగాయలు తామే పండించుకుంటారు. కొలనులో చేపలు పెంచుతున్నారు.
గుడ్ల నుంచి పాలు, తేనె వరకు బయటికి వెళ్లాల్సిన అవసరమే వారికి ఉండదు. ‘వ్యర్థం నుంచి ఇంధనం’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక గదిలో ప్రత్యేకంగా పుట్టగొడుగులు పెంచుతున్నారు. కూరగాయలు, గుడ్లు, చేపలు, పుట్టగొడుగులు....మొదలైన వాటి అమ్మకం ద్వారా ఎంతో కొంత డబ్బు కూడా సంనాదిస్తున్నారు.
‘హోమ్ విత్ జీరో కాస్ట్ ఆఫ్ లివింగ్’ కాప్షన్‌తో కావ్య, సంగీత్ దంపతులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. 33 లక్షల లైక్‌లు, 19,000 కామెంట్స్, 33 మిలియన్‌ల వ్యూస్ వచ్చాయి.
(చదవండి: ఒకప్పుడు... ఎటు చూసినా చెత్తే ఇప్పుడు... ఎటు చూసినా పచ్చదనమే!)