అన్నదానం కార్యక్రమంలో భాగంగా , శబరిమల వద్ద అయ్యప్ప భక్తులకు సాంప్రదాయ కేరళ సద్య పంపిణీ ఈ నెల డిసెంబర్21 నుంచి ప్రారంభమైంది. దేవస్వం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ OG బిజు ఉత్సవ దీపం వెలిగించి , అయ్యప్ప స్వామికి సద్యను నివేదించి మరి సేవను ప్రారంభించారు.
ఈ విందు కేరళ అసలైన రుచిని ప్రతిబింబిస్తుంది. ఇందులో పరిప్పు , సాంబార్ , రసం , అవియల్ , తోరన్ , ఊరగాయ , పప్పడం, పాయసం ఉంటాయి. వైవిధ్యం, తాజాదనాన్ని కాపాడుకోవడానికి , అవియల్, తోరన్లను ప్రతిరోజూ భిన్నంగా తయారు చేస్తారు. అయితే మోర్ , రసం లేదా పులిస్సేరిని ఒకరోజు విడిచి ఒకరోజు వడ్డిస్తారు. అలాగే ప్రతిరోజూ కొత్త రకం పాయసం కూడా అందిస్తారు.
పర్యావరణ అనుకూల పద్ధతులకు అనుగుణంగా , స్టీల్ ప్లేట్లు, గ్లాసులను ఉపయోగించి ఆహారాన్ని వడ్డిస్తారు. ప్రతి మధ్యాహ్నం సుమారు 5 వేల మందికి పైగా యాత్రికులకు భోజనం అందిస్తారు. సాంప్రదాయ సద్య, పులావ్‌ను ప్రత్యామ్నాయ రోజులలో వడ్డిస్తారు.
ప్రారంభ సాంకేతిక జాప్యాలను పరిష్కరించిన తర్వాత, అధికారులు ఇప్పుడు ఈ గొప్ప సేవను కొనసాగించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. కేరళ గొప్ప వంటకాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ సేవను ప్రారంభించారు.
(చదవండి: చెత్తను కొనుగోలు చేసే తొలి గ్రామం..అందుకోసం ఏకంగా యాప్..!)


