కరీంనగర్: అప్పుల భారంతో, మానసిక వేధింపులను భరించలేక ఓ దంపతుల జంట గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారంం దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు తమ బంధువు అయిన పల్లె అనిల్ కు లక్షల్లో డబ్బులు అప్పుగా ఇప్పించారు. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో, అప్పు ఇచ్చిన వారి నుంచి శ్రీహర్షపై తీవ్ర ఒత్తిడి పెరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ క్రమంలో నిన్న డబ్బులు చెల్లించాలంటూ అప్పు ఇచ్చిన వారు శ్రీహర్షను తీవ్రంగా బెదిరించినట్లు తెలుస్తోంది. డబ్బుల చెల్లింపుకు కొంత సమయం ఇవ్వాలని కోరినప్పటికీ వారు అంగీకరించలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గ్రామంలో పరువు పోతుందన్న భయంతో, తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన శ్రీహర్ష, రుక్మిణి దంపతులు ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. మృతులు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పుల వేధింపులు, బెదిరింపుల కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.


