
ఒకప్పుడు యూపీలోని నోయిడాలో డంపింగ్ గ్రౌండ్‌ల చుట్టుపక్కల నివసించే ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఇన్నీ అన్నీ కావు. అపరిశుభ్రత రాజ్యమేలే ఆ ప్రదేశాల సమీపంలో నడవాలంటే దుర్వాసన భరించడం కష్టంగా ఉండేది. చెత్తపడేసేవాళ్లకు, చుట్టుపక్కల వాళ్లకు ఎప్పుడూ ఏవో తగాదాలు జరుగుతూనే ఉండేవి. ఈ పరిస్థితిలో సమూలంగా మార్పు తీసుకురావడానికి సేఫ్ (సోషల్ యాక్షన్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్‌మెంట్) అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సమూల మార్పు తీసుకువచ్చాడు విక్రాంత్ టోంగాడ్.
‘ఈ స్థలం ఇక ఎందుకు పనికి రాదు’ అనుకున్న స్థలాన్ని పచ్చదనంతో కళకళలాడేలా చేశాడు. దీనికి ముందు ఘజియాబాద్‌లో వ్యర్థాలు పడేసే ప్రదేశాలను ఆహ్లాదకరమైన ప్రదేశాలుగా మార్చాడు. స్వచ్ఛంద కార్యకర్తల భాగస్వామ్యం, సీఎస్‌ఆర్(కార్పోరెట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫండింగ్‌తో చెత్త వేయడానికి తప్ప ఎందుకు పనికిరాదు అనుకున్న పది ఎకరాల స్థలంలో వ్యర్థాలు లేకుండా చేశాడు. వందల కిలోల ప్లాస్టిక్‌ను రీసైకిల్‌కు ఉపయోగించాడు.
ప్లాస్టిక్ బెంచీలు తయారుచేయించాడు. మొక్కలు నాటడం మొదలుపెట్టాడు. రెండు మూడు సంవత్సరాల వ్వవధిలో ఎక్కువ చెట్లు పెంచేలా జపనీస్ ‘మియావాకీ మెథడ్’ను అనుసరించాడు. ‘ఒక్కడే కష్టపడుతున్నాడు’ అన్నట్లుగా ఉండేది ఒకప్పుడు విక్రాంత్ పరిస్థితి. అయితే స్థానికులు అతడికి తోడయ్యారు. దీంతో విక్రాంత్ పని సులువు అయింది. ఒకప్పుడు ‘ఎటు చూసినా చెత్తే’ అన్నట్లుగా ఉండే ప్రదేశాలు ఇప్పుడు ‘ఎటు చూసినా పచ్చదనమే’ అన్నట్లు మారాయి.