వైఎస్ జగన్.. రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన నేత. జన సంక్షేమమే లక్ష్యంగా.. అవినీతి రహిత, నిష్పాక్షికమైన పాలన అందించారాయన. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులెన్నో తెచ్చారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ సేవలను ప్రతీ ఇంటి గడప దగ్గరకి చేర్చడం.. ఆయన్ని అందరివాడిగా మార్చేసింది. అలా జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజల్లో ఒక భరోసా కనిపించేది..
ఇచ్చిన మాటకు కట్టుబడటం.. దానిని నిలబెట్టుకోవడం.. విలువలు, విశ్వసనీయత వైఎస్ జగన్ నైజం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన చేశారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు. ఓ వైపు భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చారు.
(డిసెంబర్ 21వ తేదీ) నాడు జననేత జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలూ, సంక్షేమ ఫలాలను అభిమానులు, ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమం అందక పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి పాలన నుంచి విముక్తి కలిగి మళ్లీ జగనన్న రాజ్యం రావాలంటూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.
వ్యవసాయరంగాన్ని పండగ చేశారు..
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అన్నదాతలకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వ్యవసాయరంగాన్ని పండగ చేసి చూపించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేశారు. ఐదేళ్లలో రైతుల రైతుల సంక్షేమం కోసం రూ.1,84,567 కోట్లు ఖర్చుచేసింది. రైతు భరోసా పథకంతో పెట్టబడి సాయం అందించి.. అందరికీ అన్నంపెట్టే రైతన్నకు వైఎస్ జగన్ తోడుగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై ఆర్థిక భారం పడనీయకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేసింది. ప్రభుత్వమే ప్రీమియం భారాన్ని భరించింది. వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసా కేంద్రాలు, ఇన్ ఫుట్ సబ్సిడీ, యంత్ర సేవా కేంద్రాలు, వైఎస్సార్ అగ్రిలాబ్స్, వైఎస్సార్ పశు సంరక్షణ, జగనన్న పాల వెల్లువతో అన్నదాతకు అభయం ఇచ్చారు.
ప్రజారోగ్య ముఖచిత్రాన్ని మార్చేశారు..
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలోని ప్రజారోగ్య ముఖచిత్రాన్నే వైఎస్ జగన్ మార్చేశారు. గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యసేవలను విస్తరించారు. ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. 108,104 సేవలు, గిరి పుత్రులకు బైక్ అంబులెన్స్‌లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్ కాలేజీలు, వైఎస్సార్ కంటి వెలుగు, తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్, డాక్టర్ వైఎస్సార్ టెలీ మెడిసిన్ వంటి విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. కోవిడ్ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొని దేశానికే ఆదర్శంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిలిచింది. ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ.. రూ.785 కోట్లతో వైఎస్సార్ సుజల ధార మంచినీటి ప్రాజెక్ట్, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్శించారు.
చదువుల విప్లవం..
విద్యారంగంలో కేవలం సంస్కరణల కోసమే రూ.73 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కింది. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్ రూమ్ లు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు, అమ్మ ఒడి, గోరు ముద్ద, విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన వంటి పథకాలతో విద్యారంగం స్థితిగతులనే వైఎస్ జగన్ మార్చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
ముఖ్యంగా ‘ఆర్థిక సమస్యలతో ఏ పేదింటి బిడ్డ చదువు ఆగిపోకూడదు.. వారు బాగా చదవాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని వారంతా ఉన్నతంగా ఎదగాలన్నది వైఎస్ జగన్ ఆకాంక్ష. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో సౌకర్యాలకు దూరమై కునారిల్లిన ప్రభుత్వ బడులకు జవసత్వాలు కల్పించి వాటిని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పరుగులు పెట్టించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అంతకుముందెన్నడూ లేని రీతిలో పెరిగాయి. వివిధ రాష్ట్రాలు, దేశాలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్‌లాంటి సంస్థలు ఏపీ విద్యా సంస్కరణలపై ప్రశంసలు కురిపించారు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..
వైఎస్సార్‌సీపీ పాలనలో అక్క చెల్లెమ్మలకు.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ. 2,83,866 కోట్లు అందించారు. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ ప్రభుత్వం తోడుగా నిలిచింది. మహిళా సాధికారితే లక్ష్యంగా 33.15 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏటా రూ.18,750 చొప్పున 4 విడతల్లో రూ.75 వేలు అందించారు. రూ.19,189 కోట్లు ప్రభుత్వం అందించింది. వైఎస్సార్ కాపునేస్తం ద్వారా అక్కచెల్లెమ్మలకు గత ఐదేళ్ల పాలనలో రూ.2030 కోట్లు లబ్ధి కలిగింది.
వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం చేదోడుగా నిలిచింది. ఐదేళ్ల పాలనలో రూ.1.05 లక్షల లబ్దిపొందారు. వైఎస్సార్ చేయూత, ఆసరాతో లక్షలాది మంది మహిళలకు వైఎస్ జగన్ అన్నలా నిలిచారు. ఈ పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపారు. చంద్రబాబు హయాంలో కుదేలైన పొదుపు సంఘాలకు తిరిగి జీవం పోశారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 16,44,029 మంది మహిళలకు లబ్ధి కలిగింది.
అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వు..
వైఎస్ జగన్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతల పట్ల మానవత్వాన్ని కనబరుస్తూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలాంటి లక్షలాది మందికి వారి ఇంటికే వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపి, వారి జీవితాల్లో వెలుగులు నింపారు.
అన్ని వర్గాలకూ..
వైఎస్సార్ వాహన మిత్ర, లా నేస్తం.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ నేతన్న నేస్తం, జగనన్న తోడు పథకం.. ఇలా ఎన్నో పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారు. సంక్షేమం అంటే మంచి.. వైఎస్ జగన్ పాలనలో అదే జరిగింది. అన్ని వర్గాలకూ పథకాలు అందాయి. సామాజిక న్యాయం, సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా వైఎస్ జగన్ సుపరిపాలన అందించారు.
కోవిడ్‌లోనూ సంక్షేమం..
కోవిడ్ సమయంలో సీఎం జగన్ చేపట్టిన చర్యల వల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చితే మరణాలు తక్కువ. విపత్కర పరిస్థితులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది. కోవిడ్‌తో ఆదాయం అడుగంటినా సామాన్యుల కష్టాలే ఎక్కువని భావించిన వైఎస్ జగన్ 2021లో ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా నిరాటంకంగా అమలు చేశారు. సంక్షోభంలో పేదలను గట్టెక్కించారు. ముందుగా ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్‌ను అనుసరిస్తూ మాట ప్రకారం పథకాలను అమలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలోనూ రైతులతో పాటు అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. కోవిడ్‌పై పోరులో సచివాలయ వ్యవస్థ కీలకంగా నిలిచింది. ముందుచూపుతో అందుబాటులోకి తెచ్చిన సచివాలయాల వ్యవస్థ ద్వారా కోవిడ్ మహమ్మారిని వైఎస్ జగన్ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది.
అభివృద్ధి పరుగులు..
'అభివృద్ధి' అంటే ఏమిటో వైఎస్ జగన్ చేసి చూపించారు. అభివృద్ధి పరుగులు తీయించారు. సీఎం అయిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 1.34 లక్షల ఉద్యోగాలిచ్చారు. 58 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించారు. 17 మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
వైఎస్ జగన్ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో రాష్ట్రం ఏటా అగ్రగామిగా నిలిచింది. 59 నెలల్లో రూ.1.02 లక్షల కోట్లు పారిశ్రామిక పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి వచ్చాయి. స్పష్టమైన విధానాలు, ప్రోత్సాహకాలు, పక్కా ప్రణాళికతో వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వేలాది మందికి ఉపాధి లభించింది. కోవిడ్ సృష్టించిన సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగం దెబ్బతిన్న సమయంలోనూ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పరిశ్రమలు నిలదొక్కుకొనేలా చర్యలు చేపట్టింది. ప్రోత్సాహకాలతో పారిశ్రామిక రంగాన్ని ఆదుకొంది.


