బిహార్‌లో ఎన్డీయే ప్రభంజనానికి పలు కారణాలు
నితీశ్ కుమార్ పథకాల పట్ల ఆకర్షితులైన జనం
అధికార కూటమికి అండగా నిలిచిన మహిళా ఓటర్లు
ఎన్డీయేను ఆదరించిన ఓబీసీలు, ఈబీసీలు, దళితులు
విపక్ష కూటమిని ముంచిన అంతర్గత కుమ్ములాటలు
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార జాతీయ ప్రజా స్వామ్య కూటమి(ఎన్డీయే) మరోసారి విజయ ఢంకా మోగించింది. ఎవరూ ఊహించని విధంగా అఖండ విజయం దక్కించుకుంది. ఈస్థాయి ప్రభంజనాన్ని కూటమి పెద్దలు కూడా అంచనా వేయలేకపోయారు. 243 స్థానాలకు గాను 160 వరకు సీట్లు రావొచ్చని భావించగా, ఏకంగా 200కుపైగా సీట్లను ఎన్డీయే తన ఖాతాలో వేసుకుంది. ఈ అపూర్వమైన గెలుపు వెనుక బహుళ కారణాలు కనిపిస్తున్నాయి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక పరిస్థితులు, పదునైన ఎన్నికల మేనేజ్‌మెంట్ వంటివి ఎన్డీయేకు కలిసొచ్చాయి. అధికార కూటమి విజయానికి దోహదపడిన కొన్ని కీలక అంశాలు ఏమిటంటే..
మహిళలు–ఈబీసీ సమ్మేళనం
ఈ ఎన్నికల్లో మహిళలు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి, ఉత్సాహంగా ఓటు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ జిల్లాల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు వేయడం గమనార్హం. వారు ఈ ఎన్నికల్లో ఎన్డీయేకు అండగా నిలిచారు. సరిగ్గా ఎన్నికల ముందు పలు మహిళా సంక్షేమ పథకాలను నితీశ్ కుమార్ ప్రభుత్వం ప్రకటించింది. జీవికా దీదీ పథకం కింద అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10,000 చొప్పున బదిలీ చేసింది.
ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ) మహిళలకు కూడా సాయం అందజేసింది. రాష్ట్రంలోని 3.51 కోట్ల మహిళా ఓటర్లలో దాదాపు 40 శాతం మందిని ఇది నేరుగా ప్రభావితం చేసింది. మహిళా సాధికారతపై నితీశ్ కుమార్ చాలా రోజులుగా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. వారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్యల ఫలితంగా ఎన్డీయే పట్ల మహిళా ఓటర్లు ఆకర్శితులయ్యారు. వారి ఆదరణ ఓట్ల రూపంలో బీజేపీ కూటమికి బదిలీ అయ్యింది.
కులాల సమీకరణాలు
వేర్వేరు కులాలను తమకు అనుకూలంగా ఒక్కతాటిపైకి తీసుకురావడంలో ఎన్డీయే సఫలమైంది. అగ్రవర్ణాల ఓటర్లు సంప్రదాయకంగా బీజేపీ వెన్నంటే నిలుస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ ఆ ఆనవాయితీ యథాతథంగా కొనసాగింది. మరోవైపు ఓబీసీలు, ఈబీసీలతోపాటు దళితుల్లో గణనీయమైన ఓ వర్గం ఎన్డీయేకు మద్దతు పలకడం విశేషం. కులాల లెక్కలపై విపక్ష మహాగఠ్‌బంధన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. భిన్న సామాజిక వర్గాలు ఎన్డీయే వెనుక సంఘటితమయ్యాయి. అధికార కూటమినే వారు మరోసారి
విశ్వసించారు.
విపక్షాల్లో చీలికలు
బీజేపీ కూటమిలో స్పష్టమైన ఐక్యమత్యం కనిపించగా, కాంగ్రెస్–ఆర్జేడీ కూటమిలో చీలికలు బహిర్గతమయ్యాయి. చివరి నిమిషం వరకు సీట్ల పంపకం సక్రమంగా జరగలేదు. కొన్నిచోట్ల స్నేహపూర్వక పోటీలు తప్పలేదు. పొత్తు ధర్మాన్ని విస్మరించి, కూటమి పారీ్టలే పరస్పరం పోటీకి దిగాయి. మరోవైపు ఓట్ల బదిలీ సైతం జరగలేదు. తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యరి్థగా ప్రకటించడం కూటమిలో కొందరికి నచ్చలేదు. ప్రతిపక్షానికి ఒక ఉమ్మడి వ్యూహం లోపించింది. ఎవరికి వారే అన్నట్లుగా ప్రవర్తించారు. మహాగఠ్‌బంధన్‌ను బలహీన కూటమిగా ప్రజలు భావించారు. దాంతో ఎన్డీయేకు ఎదురే లేకుండాపోయింది. మొత్తానికి ప్రతిపక్షం స్వీయ తప్పిదాలతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
చీలిన ముస్లిం ఓట్లు
కాంగ్రెస్–ఆర్జేడీ కూటమికి ప్రధాన బలం ముస్లిం–యాదవ్ ఓట్లే. కానీ, ఈసారి ముస్లింలు, యాదవులు ఆ కూటమిని అంతగా ఆదరించలేదు. ఈ రెండు వర్గాలను అనుకూలంగా మార్చుకోవడంలో ప్రతిపక్ష కూటమి విఫలమైంది. ముఖ్యంగా సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం అభ్యర్థులు బరిలో ఉండడం మహాగఠ్‌బంధన్ విజయావకాశాలను దెబ్బకొట్టింది. ముస్లింల ఓట్లు భారీగా చీలిపోయాయి. రా్రïÙ్టయ జనతాదళ్(ఆర్జేడీ) బలమైన యాదవుల్లోనూ చీలికలు కనిపించాయి. యాదవుల్లో ఓ వర్గం ఎన్డీయేకు అండగా నిలిచింది. గెలిస్తే ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ ఆర్జేడీ చేసిన
ప్రచారాన్ని జనం నమ్మలేదు.
ఎన్నికల మేనేజ్‌మెంట్
చురుకైన ఎన్నికల మేనేజ్‌మెంట్ ఎన్డీయేకు బలంగా మారింది. 2020 నాటి ఎన్నికల్లో చోటుచేసుకున్న చిన్నచిన్న పొరపాట్లను ఆ కూటమి సరిచేసుకుంది. ఈసారి కూటమి పక్షాల మధ్య సమన్వయం బాగా పెరిగింది. వాటి మధ్య చక్కటి సహకారం కనిపించింది. బూత్–స్థాయి మేనేజ్‌మెంట్ బాగా పనిచేసింది. ఎన్నికల ప్రచారంలో కూటమి పారీ్టలన్నీ కలిసికట్టుగా పాల్గొన్నాయి. అంతర్గతంగా అక్కడక్కడా అభిప్రాయభేదాలున్నా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డాయి. బీజేపీ, జేడీ(యూ), లోక్ జనశక్తి పార్టీ, హిందుస్తానీ అవామీ మోర్చా(సెక్యులర్), రా్రïÙ్టయ లోక్ సమతా పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేశారు. వారంతా నిత్యం ప్రజల్లో ఉండడం, ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించడం ఎన్డీయే విజయ తీరాలకు చేర్చింది.
కొంపముంచిన ‘జంగిల్‌రాజ్’
జంగిల్‌రాజ్ అనగానే గుర్తొచ్చే పేరు బిహార్. ఆర్జేడీ హయాంలో ఆటవిక పాలన కొనసాగిందని, ప్రతిపక్షానికి ఓటేస్తే ఆనాటి రాక్షస రాజ్యం మళ్లీ వస్తుందని ఎన్డీయే నేతలు పదేపదే హెచ్చరించారు. జంగిల్‌రాజ్ రోజులను జనం ఇప్పటికీ మర్చిపోలేదు. మహాగఠ్‌బంధన్‌కు ఓటేస్తే జరిగేదేమిటో ఊహించుకొని మరోసారి ఎన్డీయేకు పట్టం కట్టారు. అభివృద్ధి కావాలి తప్ప ఆటవిక రాజ్యం వద్దని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అవినీతిపరుడు కాకపోయినప్పటికీ అవకాశవాది అనే ముద్ర ఉంది. అధికారం కోసం సులువుగా కూటములు మార్చేస్తారన్న విమర్శలున్నాయి. అయినా సరే ఓటర్లు ఆయన పరిపాలనను ఆదరించారు. నితీశ్ నాయకత్వం, పాలనా సామర్థ్యం కూడా ఎన్డీయేకు అనుకూలంగా మారింది.
ఉచిత విద్యుత్.. మధ్యతరగతికి భరోసా
రాష్ట్రంలో 1.67 కోట్ల కుటుంబాలకు 125 యూనిట్ల వరకు విద్యుత్ ఉచిత పథకాన్ని ఎన్నికల ముందే అమలు చేయడం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకుంది. సుమారు 5 కోట్ల మంది ఓటర్లు ఈ పథకంతో లబ్ధి పొందారు. అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామంటూ విపక్ష కూటమి హామీ ఇచి్చనా, ’ఇప్పటికే వస్తున్న’ప్రయోజనం ముందు ఆ హామీ నిలవలేకపోయింది.
వృద్ధులు, ఆశ్రితులకు ఆదరణ
సామాజిక భద్రతా పెన్షన్‌ను రూ.400 నుంచి ఏకంగా రూ.1100కి పెంచడం 1.11 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నేరుగా ప్రయోజనం చేకూర్చింది. ఇది వారి కుటుంబాల్లో ఎన్డీయే పట్ల బలమైన సానుకూలతను నింపింది.
యువత, విద్యార్థుల మద్దతు
నిరుద్యోగ భృతి(7.6 లక్షల మందికి), స్టూడెంట్ క్రెడిట్ కార్డ్‌పై వడ్డీ మాఫీ (4 లక్షల మందికి) పథకాలు యువతను, విద్యార్థులను ఎన్డీయే వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించాయి.
సోషల్ ఇంజనీరింగ్ సూపర్ హిట్
గత ఎన్నికల్లో దూరమైన చిరాగ్ పాశ్వాన్, ఉపేంద్ర కుశ్వాహాలను తిరిగి కూటమిలోకి తీసుకురావడం నితీశ్–బీజేపీల రాజకీయ వ్యూహానికి పరాకాష్ట. వీరితోపాటు జీతన్ రామ్ మాంఝీని నిలబెట్టుకోవడం ద్వారా దళిత, అత్యంత వెనుకబడిన, కుశ్వాహా ఓట్లను ఎన్డీయే గంపగుత్తగా సాధించింది. ఈ ముగ్గురూ తమ వర్గాల ఓట్లను ఎన్డీయేకు బదిలీ చేయడంలో సంపూర్ణంగా విజయం సాధించారు.
అభివృద్ధి, హిందుత్వ
ఒకవైపు పూరి్ణయా విమానాశ్రయం, బెగుసరాయ్ వంతెన వంటి అభివృద్ధి పనులను చూపిస్తూనే, మరోవైపు సీతామఢిలో జానకీ ఆలయ(సీతాదేవి) నిర్మాణానికి అమిత్ షా, నితీశ్ కుమార్‌లు భూమి పూజ చేయడంతో హిందుత్వ ఓటు బ్యాంకు కూడా బీజేపీని బలపర్చింది. ప్రచారంలో మోదీ స్వయంగా రంగంలోకి దిగడం ఎన్డీయేకు కొండంత బలాన్నిచి్చంది. 16 రోజుల్లో 14 కీలక జిల్లాల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేశారు.


