కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలను ప్రశంసిస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ఒకప్పడు సాధారణ కార్యకర్తలా పనిచేసిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఎదిగారన్నారు. ప్రధాని మోదీ 1990 దశకంలో ఉన్న చిత్రాన్ని తన ఎక్స్ ఖాతాలో జోడిస్తూ ఈ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్‌ను ఇరుకున పడేశాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే పెనం లోంచి పొయ్యి మీద పడ్డ చందాన కనిపిస్తుంది. ఇప్పటికే తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు తరచుగా ఆ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తూ సంస్థాగత లోపాలను ప్రశ్నిస్తుంటే.. తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ కీలక నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు హస్తానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి.
దిగ్విజయ్ సింగ్, ప్రధాని మోదీకి సంబంధించిన 1990 దశకం చిత్రాన్ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆ చిత్రంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘోలా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంలో తీసింది. ఇందులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఉన్నారు. ఇందులో ప్రధాని మోదీ సాధారణ కార్యకర్తలా అద్వానీ ముందు నేలపై కూర్చొని ఉన్నారు. ఆ చిత్రాన్ని ప్రశంసిస్తూ దిగ్విజయ్ సింగ్ పోస్ట్ చేశారు.
"ఈ చిత్రాన్ని నేను కోరాలో చూశాను. ఇది చాలా ఇంపాక్ట్ పుల్ అనిపించింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ, జనసంఘ్ సంస్థాగత నిర్మాణం ఎలా ఉంటుందో ఈ చిత్రం తెలుపుతుంది. ఒకప్పుడు నాయకుల ముందు నేలపై కూర్చున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు దేశానికే ప్రధాని అయ్యారు. ఇది సంస్థ యెుక్క గొప్పతనానికి నిదర్శనం. జైశ్రీరామ్" అని దిగ్వీజయ్ సింగ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆ పోస్టును ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ట్యాగ్ చేశారు.
ఈ పోస్టుతో బీజేపీ కాంగ్రెస్‌పై అటాక్ స్టార్ట్ చేసింది. దిగ్విజయ్ సింగ్ పోస్టులకు రాహుల్ సమాధానం ఇవ్వగలరా అని ప్రశ్నించింది. అయితే దీనిపై స్పందించిన దిగ్విజయ్ సింగ్ తాను ఆర్ఎస్ఎస్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. తాను కేవలం ఆర్గనైజేషన్ సంస్థగత నిర్మాణాన్ని మాత్రమే తాను ప్రశంసించానని తెలిపారు.
కాగా వారం రోజుల క్రితం దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీలోని లోపాలను బహిరంగంగా ప్రశ్నించారు "రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్‌కు ఎలా సంస్కరణలు అవసరమో కాంగ్రెస్‌కు సైతం అదేవిధంగా సంస్కరణలు అవసరం. నాయకత్వ వికేంద్రీకరణ జరగాలి. మీరు అది చేయగలరని నాకు తెలుసు. కానీ మిమ్మల్ని ఒప్పించడమే పెద్ద ప్రాబ్లం అని రాహుల్‌ని ఉద్దేశించి అన్నారు. ఈ వ్యాఖ్యలపై గతంలో దుమారం చెలరేగింది.


