అస్సాం, పుదుచ్చేరిల్లో పర్యటించిన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్
జనవరిలో కేరళ, తమిళనాడు, బెంగాల్‌లకు వెళ్లనున్న నితిన్ నబిన్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇటీవల నియమితులైన నితిన్ నబిన్ అప్పుడే కార్యరంగంలోకి దూకారు. వచ్చే ఏడాదిలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రా పార్టీ ఇన్‌ఛార్జీలు, కీలక నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని తిరిగి నిలబెట్టడం, బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ఓటు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘జాతీయ పార్టీ అయినా, స్థానికంగానే ఆలోచించాలి’అన్న విధానంతో రాష్ట్రానికో ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మూడు రాష్ట్రాల్లో పట్టుకోసం..
కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన నబిన్ ఐదు రాష్ట్రాల ఎన్నికలతో తొలి పరీక్ష ఎదుర్కోనున్నారు. ఇందులో ముఖ్యంగా గడిచిన దశాబ్ధాల కాలంగా అధికారం అందుకోలేకపోతున్న బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పాగా వేయడం అంత సులభమయ్యేది కాదు. దీనికి తోడు ఇప్పటికే రెండుమార్లు అధికారంలో ఉన్న అస్సాంలో పార్టీని తిరిగి నిలబెట్టడం కత్తిమీద సాములాంటిదే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను నబిన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రణాళికలు, భవిష్యత్ వ్యూహాలపై ఆయన ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, తరుణ్ ఛుగ్, వినోద్ తావ్డే, అరుణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్ తదితరులతో చర్చించారు. ఈ సందర్భంగానే ప్రతి బూత్‌కు ఒక ఇన్‌ఛార్జి, ఒక డేటా వలంటీర్, ఒక సోషల్ మీడియా వలంటీర్‌లను సిధ్దం చేయాలనే సూచనలు వచ్చాయి.
‘ఎన్నికలను స్టేజ్ మీద కాదు..బూత్ వద్ద గెలుస్తాం’అన్న విధానాన్ని అవలంబిస్తూనే..యువత, మహిళలను క్రియాశీలకం చేయాలని నిర్ణయించారు. స్థానిక సామాజిక సమీకరణలపై సర్వేలు, ప్రాంతాల వారీగా అధికంగా ఉండే వర్గాల మ్యాపింగ్, చిన్నచిన్న సమావేశాలు, స్థానిక భాషల్లో పార్టీ కంటెంట్ ప్రచారం వంటి దృష్టి సారించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా బెంగాల్‌లో ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని నబిన్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీనిపై ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న బన్సల్ నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. కాయస్థ కులస్థుడైన నబిన్ సామాజిక వర్గానికి చెందిన జనాభా పశి్చమ బెంగాల్‌లో గణనీయమైన రాజకీయ, సామాజిక ప్రభావాన్ని కలిగి ఉంది. కోల్‌కతా, అసన్‌సోల్, సిలిగురి వంటి నగరాల్లోని బిహారీ వలసదారుల జనాభా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం నుంచే తన తొలి రాష్ట్ర పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
జాతీయ భద్రత, జీవనోపాధి, శాంతిభద్రతలు, వలసలు వంటి అంశాలతో రాష్ట్రంలోకి చొచ్చుకెళ్లేలా, టీఎంసీకి బలమున్న చోట బీజేపీ ఓటు శాతం పెంచేలా, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లతో పార్టీకి అనుబంధం పెంచేలా చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇప్పటికే రోడ్‌మ్యాప్ ఖరారైనట్లు చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత నబిన్ బెంగాల్ పర్యటన ఉంటుందని అంటున్నారు. ఇక తమిళనాడులో బలమైన ప్రాంతీయ పార్టీలతో కూటమి..స్థానిక భాష, సంస్కృతి మీద గౌరం చూపేలా ప్రచారం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలతో బూత్ స్థాయి వరకు పార్టీని చేర్చాలన్నది లక్ష్యంగా నిర్ణయించారు.
జనవరి తొలి వారంలో నబిన్ ఇక్కడ పర్యటించేలా షెడ్యూల్ ఖరారైంది. ఇక కేరళలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పాగా వేయడాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని నబిన్ భావిస్తున్నారు. తిరువనంతపురం మున్సిపల్ మేయర్ పీఠాన్ని కైవసం అంశాన్ని భవిష్యత్ ఎన్నికలకు పునాదిగా మలుచుకోవాలని నిర్ణయించారు. తొలిసారి ఓటువేసే యువతకు తమ వైపు తిప్పుకోవడంతో పాటు..ఉద్యోగాలు, విద్య అంశాలపై ప్రచారం చేస్తూ ఓటు శాతాన్ని గణనీయంగా పెంచితే గెలుపు సాధ్యమన్నది నబిన్ ఆలోచనగా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇక అస్సాంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పనితీరును హైలెట్ చేయడం, స్థానిక నాయకులను అప్రమత్తం చేయడం, కాంగ్రెస్‌పై మరింత పదునుగా విమర్శలకు దిగేలా ఇప్పటికే రాష్ట్ర పర్యటన సందర్భంగా నేతలకు నబిన్ మార్గదర్శనం చేశారు. ఇప్పటికే పుదుచ్చేరిలోనూ పర్యటించిన నబిన్, పారీ్టకి ఉన్న బలాన్ని నిలుపుకునే అంశాలపై నేతలకు కీలక సూచనలు చేశారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని నిలబెడుతూనే, కొరగరానికొయ్యగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే బలమైన పట్టుదలతో నబిన్ ముందుకెళ్తున్నారు.


