సంక్రాంతి పండుగ సీజన్ సంధర్భంగా ప్రజలకు దక్షిణమధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. రైల్వే విద్యుత్ తీగలపై చిక్కి వేలాడుతున్న గాలిపటం దారాలను ఎట్టిపరిస్థితుల్లో తాకకూడదని ప్రజలను హెచ్చరించింది. రైల్వే ప్రాంగణాల పరిసరాల్లో, యార్డులు, ట్రాక్‌లు మరియు సమీపంలోని జనసంచార ప్రాంతాలలో గాలిపటాలు ఎగురవేయడం వల్ల విద్యుదాఘాతానికి గురైన సంఘటనలు ఇదివరకూ అనేకం జరిగాయని తెలిపింది. పతంగీలు ఎగరవేయడంపై జాగ్రత్తలను సూచిస్తూ ప్రకటన విడుదల చేసింది.
గత సంక్రాంతి పండుగ సీజన్‌లో విద్యుధాఘాత ఘటనలు రైల్వేలోని అనేక జోన్‌లలో నమోదయ్యాయని తెలిపింది. కొంతమంది వ్యక్తులు 25 కె.వి ట్రాక్షన్ ఓవర్‌హెడ్ కండక్టర్‌లలో చిక్కుకున్న గాలిపటం దారాలను ముట్టుకోవడం ద్వారా విద్యుత్ షాక్‌లు తగిలి తీవ్ర గాయాల పాలయ్యారని పేర్కొంది. ప్రస్తుతం గాలి పఠాలు ఎగరవేయడంలో ప్రజలంతా ప్రధానంగా చైనా మాంజా వాడుతున్నారని అది చాలా ప్రమాదకరమని తెలిపింది. ఆదారాలు విద్యుత్ వాహకం ( విద్యుత్‌ను సులభంగా గ్రహించేవి) అవడం వలన మానవ ప్రాణాలకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయని రైల్వేశాఖ తెలిపింది. అంతే కాకుండా రైల్వే విద్యుత్ మౌలిక సదుపాయాలకు తీవ్ర ముప్పును కలిగిస్తాయని పేర్కొంది.
దీనివలన ప్రయాణీకులతో పాటు రైల్వే సిబ్బందికి, సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఇతర ప్రమాదాలకు దారి తీసే అవకాశాలున్నాయని తెలిపింది. కనుక ఈ విషయంలో ప్రజలు రైల్వేశాఖకు పూర్తి సహకారం అందించాలని రైల్వే ట్రాక్‌లు, స్టేషన్లు, యార్డులు మరియు ఇతర రైల్వే సంస్థాపనల దగ్గర గాలిపటాలు ఎగురవేయకూడదని రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ పండుగలను సంతోషంగా బాధ్యతాయుతంగా జరుపుకోవాలని రైలు కార్యకలాపాలను సజావుగా కొనసాగించడంలో సహాయపడాలని కోరింది.


