అస్సామీలకు అమిత్ షా పిలుపు
బోర్డోవా/గువాహటి: అస్సాం అభివృద్ధి, సంస్కృతికి ప్రతిబంధకంగా మారిన బంగ్లాదేశ్ చొరబాటుదారులను తరిమికొట్టే ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఎన్నుకోవాలని అస్సాం ఓటర్లకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సోమవారం అస్సాంలో సుడిగాలి పర్యటన చేసిన అమిత్ షా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గువాహటిలో నూతన పోలీస్ కమీషనరేట్, నిఘా కేంద్రం భవనాన్ని ప్రారంభించారు.
చొరబాటుదారులతో పోరాటంతో ప్రాణత్యాగంచేసిన వీరులకు ‘స్వాహిద్ స్మారక్ క్షేత్ర’లో నివాళులరి్పంచారు. 15వ శతాబ్దానికి చెందిన అస్సామీ సాధువు, సంఘ సంస్కర్త శ్రీమంత శంకర్‌దేవ్ ‘బతద్రవ థాన్’పుణ్యక్షేత్రంలో రూ.227 కోట్లతో పునరుద్ధరణ పనులను షా ప్రారంభించారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గోపినాధ్ బోర్దోలాయ్, సంగీత సామ్రాట్ భూపెన్ హజారికా, యువ సంగీత తరంగం, దివంగత జుబెన్ గార్గ్, దిగ్గజ అహోం జనరల్ లాచిత్ బోర్ఫుకన్‌లకు షా నివాళులరి్పంచారు.
తర్వాత బోర్డోవా పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో మీ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రం నుంచి విదేశీ చొరబాటుదారులందరినీ మూకుమ్మడిగా తరిమికొట్టే సత్తా ఉన్న ప్రభుత్వాన్నే ఎన్నుకోండి. చొరబాటుదారులను అనుమతించని సర్కార్‌ను ఎన్నుకోండి. అస్సాం అభివృద్ధికి పాటుపడే నేతలకే పట్టంకట్టండి. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడి కాంగ్రెస్ రాష్ట్రంలోకి విదేశీయుల చొరబాట్లను ప్రోత్సహించింది. ఇప్పుడది అస్సాం అస్థిత్వం, గుర్తింపునకు ముప్పుగా పరిణమించింది’’అని షా అన్నారు.
మరో ఛాన్స్ ఇవ్వండి
‘‘అస్సాంలో బీజేపీ ప్రభుత్వాల హయంలో గత పదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధ్యమైంది. ఆ అభివృద్ధి సరిపోదు. శ్రీమంత సాధువు జని్మంచిన పుణ్యస్థలి నుంచి మీకు వాగ్దానం చేస్తున్నా. మరో ఐదేళ్లు పరిపాలించే అవకాశం ఇవ్వండి. అస్సాం నుంచి చొరబాటుదారులందరినీ వెనక్కి పంపేస్తాం. ఈ రాష్ట్రమేకాదు ప్రతి రాష్ట్రం నుంచి చొరబాటుదారులను తరిమేస్తాం. ప్రధాని మోదీ మీ సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించమేకాదు మీ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతారు’’అని షా అన్నారు.


