
మనుషుల సామాజిక సంబంధాలు, భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాలు, అలకల గురించి మనకు చాలానే తెలుసు. మరి పక్షుల సంగతి? అనుబంధాలు, ఆప్యాయతలు సరే...వాటిలో కూడా కయ్యాలు, విడిపోవడాలు ఉంటాయా? వాటి సంకేతాలు ఏమిటి?... మొదలైన కోణాలలో ‘గ్రేట్ టిట్’ పక్షులపై అధ్యయనం జరిగింది. ‘యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు ‘యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్’ సమన్వయంతో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
ఈ అధ్యయనం ద్వారా తెలిసిన కీలక విషయం... ‘ఒక పక్షుల జంట విడిపోవడానికి సంబంధించిన సంకేతాలు బ్రీడింగ్ సీజన్ కంటే చాలా ముందుగానే కనిపిస్తాయి’ గతంతో పోల్చితే పక్షుల జంట తక్కువ సమయం మాత్రమే కలిసి ఉండడం, ఎప్పుడో ఒకసారి కలుసుకోవడం... మొదలైనవి అవి విడిపోబోతున్నాయి అని చెప్పడానికి సంకేతాలు.
పక్షుల ప్రపంచంలో కొన్ని జంటల అనుబంధాలలో మార్పు రాకుండా, విడిపోకుండా ఉండగలగడానికి కారణం ఏమిటి? కొన్ని జంటలు మాత్రం బ్రీడింగ్ సీజన్‌కు ముందు ఎందుకు విడిపోతాయి? అనే విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ నాన్–బ్రీడింగ్ సీజన్‌లో పక్షి జంటల ప్రవర్తన ఆధారంగా భవిష్యత్ కాలంలో అవి కలిసి ఉండబోతున్నాయా? విడిపోబోతున్నాయా? అనేది స్పష్టంగా చెప్పవచ్చు అంటున్నారు పరిశోధకులు.
(చదవండి: వాట్ ఏ క్రియేటివిటీ..! చీరల దుకాణంలో చాట్‌జీపీటీ తరహాలో..)