మా అమ్మాయికి నాలుగేళ్ల వయసున్నప్పుడు నా భార్య చనిపోయింది. అప్పటినుంచి అన్నీ నేనే అయి మా అమ్మాయిని గారాబంగా పెంచుకున్నాను. ఇప్పుడు మా అమ్మాయికి 19 ఏళ్లు. హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటూ ఇంజినీరింగ్ చేస్తోంది. అక్కడ తను చదువుకునే కాలేజీ లెక్చరర్‌తో రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉందని, ఆ లెక్చరర్‌కి ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారని, అతను తన భార్యకు విడాకులు ఇచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడని తెలిసింది. అంతేకాదు, నేను కనక తన మాట కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని చెబుతోందని కూడా తెలిసింది. నాకు నా కూతురు తప్ప వేరే లోకం లేదు. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా చెప్పగలరు.
– రామరాజు, భీమవరం
మీ సమస్య చదువుతుంటే మనసు కలచి వేస్తోంది. మీరు వయసులో ఉన్నప్పుడే భార్య చనిపోయినా మళ్లీ పెళ్లి చేసుకోకుండా మీ కూతురే ప్రపంచంగా బతికారు. అలాంటి అమ్మాయి ఈ రోజు ఇలా ప్రవర్తిస్తుంటే జీర్ణించుకోవడం కష్టమే. అయితే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇటువంటి సందర్భాలలో మీరు భావోద్వేగానికి లోనై అమ్మాయి మీద అరవడం, కోప్పడి మీవైపు లాక్కోవాలనుకోవడం సరైన పద్ధతి కాదు. మీరు ఎంత బలంగా తనని మీవైపు లాక్కోవాలనుకంటే తను అంతకన్నా బలంగా మీకు దూరంగా జరిగే ప్రమాదం ఉంది. ఆ వయసులో ఆకర్షణలు, ప్రేమ భావాలు సహజం. కానీ ఇప్పటికే వివాహమై, కుటుంబ బాధ్యతలతో ఉన్న వ్యక్తితో జీవితం ప్రారంభించాలనుకోవడం ఆమె అపరిపక్వతను సూచిస్తుంది.
మందుగా మీ కుమార్తెను నిందించకుండా ఒత్తిడి లేకుండా ఫ్రశాంతంగా మాట్లాడండి. ఆమెను మీరు అర్థం చేసుకున్నారు అన్న భావన కలిగేలా నెమ్మదిగా విషయాలను వివరించండి. సాధ్యమైనంత వరకు మూడోవ్యక్తి ద్వారా ప్రాఫెషనల్ కౌన్సెలింగ్ చేయించడం మంచిది. క్లినికల్ సైకాలజిస్టులు ఎలాంటి పక్షపాతం లేకుండా వాస్తవాలు చూపించి ఆమెకు స్వతంత్రంగా ఆలోచించడానికి దారి చూపగలరు. అదే సమయంలో మీరు మీ అమ్మాయి ప్రేమించిన వ్యక్తి చెడ్డవాడని ఆమెతో పదే పదే అనడం వల్ల ఆమె మిమ్మల్ని అ΄ార్థం చేసుకుని మీకు మరింత దూరం అవుతుంది.
వీలయితే ఆ కాలేజీ యాజమాన్యంతో మాట్లాడండి. ఒకవైపు ఇవన్నీ చేస్తూనే మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. తను ఆత్మహత్య ఆలోచనలు చేస్తోంది కాబట్టి అసలు ఒంటరిగా వదలకండి. జీవితంలో ఒకోసారి అన్ని సమస్యలకు పరిష్కారాలు మన చేతిలో ఉండచకపోవచ్చు. కాలాన్ని మించిన వైద్యుడు, అనుభవాన్ని మించిన గురువు లేడనే సత్యాన్ని గ్రహించండి. మనసు కవి ఆత్రేయ గారన్నట్టు ‘‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలే దని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని’’ అన్న తాత్త్విక ధోరణి ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరి అనిపిస్తుంది. మీరు మనసు గట్టి చేసుకుని ధైర్యంగా ఉండండి.
డా. ఇండ్ల విశాల్ రెడ్డి,
సీనియర్ సైకియాట్రిస్ట్,
విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన
మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com



