జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణం చోటుచేసుకంది. ఇక్కడి ఒక నైట్‌క్లబ్ యజమాని తన కోరిక తీర్చలేదని ఒక మహిళను లైంగికంగా వేధించి, ఆమె భర్తపై దాడి చేశాడు. ఈ ఘటన జైపూర్‌లోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘క్లబ్ ఆల్ఫా’లో చోటుచేసుకుంది. బాధితురాలు ఇరామ్ షేక్ తన భర్త నవేద్ ఉస్మానీతో కలిసి క్లబ్‌కు వెళ్లింది. ఇంతలో అక్కడున్న ఒక వెయిటర్.. క్లబ్ యజమాని భరత్ ఆమెను ఒక ప్రైవేట్ గదిలో కలవాలనుకుంటున్నట్లు తెలియజేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. కాగా క్లబ్ యజమాని అభ్యర్థనను ఆమె తిరస్కరించారు.
ఆ దంపతులు క్లబ్‌లో సేదతీరిన కొద్దిసేపటి తర్వాత ఇరామ్ షేక్ వాష్‌రూమ్ వైపు వెళ్లారు. అదే సమయంలో క్లబ్ యజమాని భరత్, మేనేజర్ దీపక్, పలువురు బౌన్సర్లు ఆమెను చుట్టుముట్టి, అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నవేద్ ఉస్మానీ అక్కడకు పరుగుపరుగున వచ్చాడు. అతను క్లబ్ యజమాని, సిబ్బందిని అడ్డుకున్నాడు. దీంతో భరత్, మేనేజర్ దీపక్, బౌన్సర్లు కలిసి నవేద్ ఉస్మానీపై దాడి చేసి, ఇనుప రాడ్లతో కొట్టారు. ఈ దాడిలో నవేద్ ఉస్మానీ కాలు విరిగింది. అంతటితో ఆగని బౌన్సర్లు బాధిత దంపతుల కారును కూడా ధ్వంసం చేశారు.
కొద్దిసేపటి తరువాత బాధితులు ఈ దాడి గురించి పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన నవేద్‌ను ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత దంపతులు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఏసీపీ బలరామ్ చౌదరి తెలిపారు. ఘటన జరిగినప్పటి సీసీటీవీ ఫుటేజీని, నిందితుల కాల్ డీటెయిల్ రికార్డులను సేకరిస్తున్నామన్నారు. సేకరించిన ఆధారాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా నైట్‌క్లబ్ యజమాని, సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కెనడా: ఇద్దరు భారతీయులపై కాల్పులు


