బద్వేలు అర్బన్: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన ఓ ప్రముఖ న్యాయవాది సైబరాసురుల వలలో చిక్కి, డబ్బులు పోగొట్టుకున్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణానికి చెందిన న్యాయవాదికి 3 నెలల కిందట గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను గుజరాత్‌కు చెందిన పోలీసు అధికారినని, మీ ఆధార్ నంబర్‌కు ఓ ఫోన్ నంబర్ లింక్ అయి ఉందని, ఆ నంబర్ ద్వారా అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నందుకు క్రిమినల్ కేసు నమోదైందని న్యాయవాదిని బెదిరించాడు.
సుప్రీంకోర్టు నుంచి మీపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని, అందుకు మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుందన్నాడు. దీంతో న్యాయవాది సమస్యను పరిష్కరించాలని కోరగా.. తొలుత రూ.18 లక్షలు డిపాజిట్ చేయాలని నేరగాడు నమ్మబలికాడు. అనంతరం పలుమార్లు ఫోన్ చేసి వివిధ లావాదేవీల ద్వారా మొత్తంగా రూ.72,68,039 బదిలీ చేయించుకున్నాడు.
ఈ విషయం బయటకు రాకూడదని, ఎవరికైనా చెబితే ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించాడు. తర్వాత ఇదంతా మోసమని గ్రహించిన న్యాయవాది పట్టణ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మోసపోయిన న్యాయవాది వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు.


