16 నుంచి కూచ్‌బెహర్ క్రికెట్ టోర్నీ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కడప వేదికగా ఈ నెల 16 నుంచి 19 వరకు వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో బీసీసీఐ అండర్–19 కూచ్‌బెహర్ ట్రోఫీ 2025–26 టోర్నమెంట్ జరగనుంది. ఈ విషయాన్ని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్‌రెడ్డి, కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఆంధ్ర–ఉత్తరఖండ్ రాష్ట్రాల జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 15వతేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండి దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ సదవకాశాన్ని విద్యుత్తు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ అనంతపురం గంగమ్మ ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. గంగమ్మా..కాపాడవమ్మా అని వేడుకున్నారు. బోనాలు సమర్పించి తలనీలాలు అర్పించారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: చింతకొమ్మదిన్నె మండలం నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా ఖోఖో సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16న జిల్లా స్థాయి జూనియర్స్, సీనియర్స్ విభాగంలో ఎంపికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రామ సుబ్బారెడ్డి, నరేంద్ర ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్స్ విభాగానికి సంబంధించి 2008 జనవరి 1 తర్వాత పుట్టి 18 సంవత్సరాల లోపు వయస్సు వారు అర్హులు అన్నారు. 18 సంవత్సరాల పైబడి వయసున్న వారు సీనియర్ విభాగానికి అర్హులు అని తెలిపారు. ఈనెల 19, 20 ,21వ తేదీల్లో ప్రకాశం జిల్లా జే. పంగులూరులో జరిగే పోటీల్లో జూనియర్ జట్టు క్రీడాకారులు , ఈనెల 24 నుంచి 26 వరకు కృష్ణాజిల్లా గుడివాడలో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో సీనియర్స్ జట్టుకు ఎంపికై న వారు పాల్గొనాల్సి ఉంటుందన్నారు.
కడప సెవెన్‌రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించు కోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్ కు కాల్ చేయవచ్చని డీఆర్వో తెలిపారు.
సభాభవన్‌లో పీజీఆర్‌ఎస్ నిర్వహణ
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)ను సోమవారం సభాభవన్ లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు.
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు.


