కళ్లెదుటే వైకుంఠము.. కల్యాణ వైభోగము..
● వైభవంగా శ్రీ వేంకటేశ్వరుని కల్యాణం
● పోటెత్తిన భక్తజనం
కడప సెవెన్‌రోడ్స్ : ‘ఒళ్లంతా కళ్లు చేసుకున్నా ఆ వైభవాన్ని తనివితీరా చూడలేము. ఆ కమనీయ దృశ్యాన్ని తిలకించిన జీవితమే ధన్యము. ఇదిగిదిగో కళ్లెదుటే వైకుంఠము’ అంటూ భక్తులు పరవశించారు. విశాలమైన పందిట్లో మనోహరంగా అలంకరించిన వేదికపై అభయముద్రతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కల్యాణ ఘట్టాన్ని చూసేందుకు గోవిందమాల దీక్షధారులైన భక్తులు బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమేతంగా తరలివచ్చారు. కల్యాణాన్ని తన్మయత్వంతో భక్తిపూర్వకంగా తిలకించారు. సోమవారం కడప నగరం మున్సిపల్ మైదానంలో శ్రీ గోవిందమాల భక్తబృంద సేవా సమితి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, అనంతరం తోమాల సేవ, అర్చనలు నిర్వహించారు. 9 గంటల నుంచి కల్యాణోత్సవం ప్రారంభమైంది.
కనుల పండువగా..
కల్యాణ ఘట్టంలో భాగంగా కుడివైపున నూతన వరుడిగా శ్రీవారిని, ఎడమవైపు ఉభయదేవేరులైన శ్రీదేవి, భూదేవి మాతలను వధువులుగా అలంకరించి కనుల పండువగా తీర్చిదిద్దారు. వేద పండితుల బృందం కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించింది. పుణ్యాహవాచనం, కలశ ప్రతిష్ఠ, గణపతిపూజ, ప్రవరలు, యజ్ఞోపవీత ధారణల అనంతరం సంప్రదాయంగా కన్యాదానం చేశారు. మహామంగళ సూత్రాలను భక్తులందరికీ దర్శింపజేశారు. అనంతరం మంగళ వాయిద్యాల సుస్వరాలు, వేదమంత్రోచ్ఛాటనల మధ్య స్వామి పక్షాన వేద పండితులు అమ్మవార్ల గళసీమల్లో మంగళ సూత్రాలను అలంకరించారు. ఈ సందర్భంగా వేద పండితుల బృందాలు తలంబ్రాల కార్యక్రమాన్ని ఉత్సాహ భరితంగా నిర్వహించారు. పూల చెండులాట ఆడారు. భక్తులందరికీ మంగళాక్షతలను కల్యాణ ప్రసాదంగా అందజేశారు. ప్రారంభం నుంచి కార్యక్రమం ముగిసేంతవరకు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. భక్తులు అడుగడుగునా చేసిన గోవిందనామ స్మరణలు ఆ ప్రాంగణంలో ప్రతిధ్వనించాయి. హాజరైన వారందరికీ వివాహ భోజనం ఏర్పాటు చేశారు.
సందడిగా గ్రామోత్సవం
సాయంత్రం ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో కోలాటాలు, చెక్కభజనలు, బ్యాండు మేళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


