సీఐపై బదిలీ వేటు.. కూటమిలో విభేదాలే కారణం?
ముద్దనూరు : స్థానిక అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దస్తగిరిని వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడానికి కూటమి నేతల విభేదాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత కొంతకాలంగా మండలంలో స్థానిక పోలీసుశాఖ వ్యవహారశైలి వల్ల కూటమిలోని ప్రధాన నేతల మధ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటులో ఘర్షణ మొదలుకొని ఇటీవల స్మార్ట్ కిచెన్ షెడ్ నిర్మాణంలో ఘర్షణ, ఇతర చిన్నచిన్న సమస్యల్లో కూడా స్థానిక పోలీసులు కూటమిలోని ఒక వర్గం వారికే వత్తాసు పలుకుతూ తమ వర్గీయులను చిన్నచూపు చూస్తున్నారనే భావనతో మరో వర్గం నేత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలుసార్లు నియోజకవర్గస్థాయి కూటమి నేత ఒకరు పోలీసు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల కూటమి వర్గీయుల మధ్య జరిగిన ఓ ఘర్షణ కేసు అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో సీఐపై వేటు పడినట్లు తెలుస్తోంది. కూటమినేతల మధ్య సమన్వయ లోపం తమకు శాపమైందని పోలీసు అధికారులు వాపోతున్నారు.


