నియోజకవర్గం సేకరించిన సంతకాలు
సాక్షి ప్రతినిధి, కడప: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజలు నీరాజనం పలికారు. ఊరు–వాడ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కన్పించింది. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలల్లో మారుమూల గ్రామాలకు సైతం ఆ పార్టీ శ్రేణులు వెళ్లి నిరసన గళాన్ని కలం ద్వారా వ్యక్త పర్చేలా వ్యవహరించారు. ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్‌సీపీ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో రగిల్చింది. సంతకాల పత్రులను వాహనాల్లో ఎక్కించి పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయానికి చేరవేశారు. అన్ని నియోజవకర్గాలకు చెందిన 4,80,101 మంది ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన ప్రతులతో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేశారు. మెడికల్ కళాశాలలు ప్రైవేట్‌పరమైతే పేదలకు వైద్య విద్య కలగానే మిగిలిపోతుందనే ఆవేదనే కోటి సంతకాల్లో భాగస్వామ్యం అయ్యేలా చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పేదలు వైద్య విద్యకు దూరం కాకుడదని.....
మెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యపై ఆశలు గల్లంతవుతాయనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఆమేరకు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 4,80,101 మంది నుంచి సంతకాలు సేకరించారు. పులివెందులలో అన్ని వసతులతో రాజసం ఉట్టి పడుతున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం కానుందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీ స్పందన లభించినట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా సంతకాలు చేసిన ఆ ప్రతులతో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టి, జిల్లా కేంద్రంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి ఇదివరకే చేర్చారు. పార్టీ అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డికి అందజేశారు.
నేడు జిల్లా కేంద్రంలోభారీ ర్యాలీకి సన్నాహాలు
ఊరు–వాడల్లో ఉద్యమ వేడి రగిల్చిన వైఎస్సార్‌సీపీ
కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన
ప్రతులను జిల్లా కేంద్రానికి చేర్చిన శ్రేణులు
బద్వేల్ 60,000
కడప 70,000
కమలాపురం 60,000
మైదుకూరు 50,000
ప్రొద్దుటూరు 1,00,200
జమ్మలమడుగు 49,700
పులివెందుల 90,201
మొత్తం 4,80,101
నియోజకవర్గం సేకరించిన సంతకాలు


