ఉత్సాహంగా గ్రీన్ హార్ట్ ఫుల్‌నెస్ 2కే రన్
ప్రొద్దుటూరు కల్చరల్: ఫిట్ ఇండియాలో భాగంగా శ్రీరామచంద్రమిషన్, రోటరీ క్లబ్, రోటరీ కంటి ఆస్పత్రి, మిడ్ టౌన్ రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రీన్ హార్ట్‌ఫుల్‌నెస్ 2కే రన్ ఉత్సాహంగా సాగింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గ్రీన్ హార్ట్‌ఫుల్ నెస్ 2కే రన్‌ను డీఎస్పీ భావన, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ హార్ట్‌ఫుల్‌నెస్ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పెంపకం, నిషేధిత ప్లాస్టిక్ వస్తువులపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలను నాటి పరిరక్షించాలని తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. డాక్టర్ వైవీ స్వరూప్ కుమార్‌ఱెడ్డి, శ్రీరామచంద్రమిషన్ జోనల్ కోఆర్డినేటర్ ఎన్.బాబు రామచంద్ర, రోటరీక్లబ్ ప్రెసిడెంట్ గజ్జల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని కాపాడి భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అన్నారు. ధ్యానం ద్వారా మనిషి మానసిక వికాసం పొందుతారన్నారు. అనంతరం వికసిత్ భారత్ ప్రతిజ్ఞ చేశారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన 2కే రన్ పుట్టపర్తి సర్కిల్‌కు చేరుకుని అక్కడ మానవ హారంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణ నినాదాలు చేశారు. శ్రీకృష్ణాలయం ఆవరణలో అల్పాహారం, 250 జామ, నేరేడు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. ఆప్కాబ్ మాజీ చైర్‌పర్సన్ ఝాన్సీరాణి,సుధాకర్‌రెడ్డి, రవిశంకర్, సత్య ప్రవీణ్, రాజశేఖర్, లక్ష్మీకాంతమ్మ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.


