నెల్లూరు జిల్లాలో బైక్‌ను కారు ఢీకొని దంపతుల దుర్మరణం
అనకాపల్లి జిల్లాలో బైక్ స్తంభాన్ని ఢీకొని ఇద్దరు యువకులు..
ఆత్మకూరు/అచ్యుతాపురం రూరల్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు, అనకాపల్లి జిల్లాలో శనివారం రాత్రి మోటారు సైకిల్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల గ్రామానికి చెందిన చవల మాధవ (38), మనోజ (35) దంపతులు.
వీరి కుమార్తె ఆత్మకూరులోని ఏపీ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఆదివారం పేరెంట్ మీట్ ఉండడంతో వీరు వెళ్లారు. ఇంటివద్ద నుంచి భోజనం తీసుకెళ్లి కుమార్తెకు తినిపించారు. అక్కడి నుంచి బైక్ మీద ఇంటికి వెళుతుండగా.. నెల్లూరు–ముంబై రహదారిలో ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోకి వచ్చేసరికి బద్వేల్ నుంచి నెల్లూరు వెళుతున్న ఇన్నోవా కారు రాంగ్‌రూట్‌లో వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు.
మంచులో దారి సరిగా కనిపించక..
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం జగన్నాథపురం సమీపంలో శనివారం రాత్రి మోటారు సైకిల్ కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో మునగపాక మండలం గణపర్తి గ్రామానికి చెందన ధనువిజయ్ (19), చెర్లోపాలెం గ్రామానికి చెందిన దూలి దుర్గ (20) మరణించారు. ఎస్‌ఐలు సుధాకర్, వెంకటరావు తెలిపిన మేరకు.. తండ్రి చనిపోవడంతో దూలి దుర్గ అచ్యుతాపురం మండలం చోడపల్లిలో తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి విద్యుత్ లైటింగ్ పనులు చేసుకుంటూ తల్లి నాగమణికి చేయూతగా నిలుస్తున్నాడు.
గణపర్తికి చెందిన భోగాది మహేష్, లక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ధనువిజయ్ లైటింగ్ పనులకు సహాయకుడిగా వెళుతున్నాడు. వీరికి జగన్నాథపురానికి చెందిన ఇంటి జగన్ స్నేహితుడు. గణపర్తిలో శనివారం జరిగిన పండుగలో వీరు ఉత్సాహంగా గడిపారు. తరువాత దుర్గను చోడపల్లిలో డ్రాప్ చేయడానికి బైక్‌పై ముగ్గురూ బయలుదేరారు. జగన్నాథపురంలో జగన్ దిగిపోయి, తన బైక్‌ను దుర్గకు ఇచ్చాడు.
రాత్రి 11.30 గంటల సమయంలో దుర్గ, ధనవిజయ చోడపల్లి వెళుతుండగా మంచు విపరీతంగా కురవడంతో దారి సరిగా కనిపించక జగన్నాథపురం సమీపంలో రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. గాయపడిన వారిని 108 వాహనంలో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందారని వైద్యులు తెలిపారు.


