నంబర్ ప్లేట్ లేని వాహనాల్లో వచ్చి గ్రానైట్ వాహనాల తనిఖీలు
పోలీసుల మాదిరిగా లాఠీలు.. వాహనాలకు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బోర్డులు
చీమకుర్తి: ప్రకాశం జిల్లాలో గ్రానైట్ సీనరేజి వసూళ్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టు అప్పగించిన ప్రైవేటు ఏజెన్సీ ఏఎంఆర్ సంస్థ సిబ్బంది ఏకంగా విజిలెన్స్ అధికారుల అవతారమెత్తారు. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బోర్డులతో ఉన్న వాహనాల్లో వచ్చి పోలీసు అధికారులమంటూ గ్రానైట్ వాహనదారుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. వివరాల్లోకెళ్తే.. గ్రానైట్ వాహనాల నుంచి సక్రమంగా బిల్లులను చెక్ చేస్తున్నారా, లేదా? తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఏఎంఆర్ సంస్థ సిబ్బంది.. విజిలెన్స్ టీమ్ సభ్యులమంటూ మూడు రోజులుగా చీమకుర్తి బైపాస్ రోడ్డుపై గ్రానైట్ వాహనాలను ఆపి ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు.
ఎటువంటి నంబర్ ప్లేట్లూ లేకుండా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బోర్డులతో, చేతిలో లాఠీలతో హడావిడి చేస్తున్నారు. తాము సెంట్రల్ గవర్నమెంట్ విజిలెన్స్ సిబ్బందిమని ఒకసారి, నెల్లూరు మైన్స్ అధికారులమని మరోసారి చెబుతూ లారీలను అడ్డుకుంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నేత గుండా శ్రీనివాసరావు వారిని ఫొటోలు తీసి చీమకుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వాహనాలను స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ఏఎంఆర్ సంస్థ యాజమాన్యాన్ని సంప్రదించగా.. సంస్థ అనుమతితోనే వారి సిబ్బంది పనితీరును తెలుసుకునేందుకు ఇలా తనిఖీలు చేశారని యాజమాన్యం సమాధానమిచ్చింది. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న వాహనాలను వదిలిపెట్టారు.


