శ్రీశైలం ఆలయంలో ప్రతి పనికీ మామూళ్లు వసూలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు
దేవస్థానంలో ఏ టెండర్ అయినా 7 శాతం బి–ట్యాక్స్ చెల్లించాల్సిందే..
దాతలు భవనాలు నిర్మించాలన్నా కమీషన్ సమర్పించుకోవాల్సిందే
శ్రీశైలం మండలంలో ఇసుక, కంకర టన్నుకు రూ.100 చొప్పున బి–ట్యాక్స్
సున్నిపెంటలో మద్యం దుకాణాల నుంచి నెలకు రూ.2లక్షలు వసూలు
డబ్బులు ఇవ్వకపోతే ఒక్క పనీ జరగదు... అవసరమైతే దాడులకూ వెనుకాడరు
ఈ దందాల కోసం ప్రత్యేకంగా ఒకరిని పెట్టుకున్న ఎమ్మెల్యే బుడ్డా
ఏడాదిన్నరగా అడ్డూ, అదుపు లేకుండా సాగుతున్న దోపిడీపర్వం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలం మల్లన్న సన్నిధిలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అనుచరులు మహాదోపిడీకి పాల్పడుతున్నారు. దేవస్థానంలో ఏ పని చేయాలన్నా కాంట్రాక్టర్ నుంచి 7 శాతం బి–ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. చివరికి దాతలు వచ్చి భక్తులకు ఉపయోగపడే సత్రాలు, భవనాలు నిర్మించి ఇవ్వాలన్నా కమీషన్లు సమర్పించుకోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. వారు చెప్పినట్లు వినకపోతే ఏ పనీ జరగకుండా అడ్డుకుంటున్నారు. కాంట్రాక్టర్లపై దాడులకు సైతం వెనుకాడటం లేదు.
వసూళ్ల కోసమే మండలానికి ఒక ఇన్‌చార్జి
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శ్రీశైలం మండలానికి తన అనుచరుడిని ఇన్‌చార్జిగా పెట్టారు. ప్రతి శాఖ అధికారులను పిలిపించి ఆయనకు పరిచయం చేశారు. తన అనుచరుడు చెప్పినట్లు వినాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన దేవస్థానంలో ఏ పని చేస్తున్నా కాంట్రాక్టర్ నుంచి 7 శాతం బి–ట్యాక్స్ ముక్కుపిండి వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.
క్యూ కాంప్లెక్స్ మరమ్మతులు, మాడవీధుల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం, పుష్కరిణి అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్ల నుంచి ఎమ్మెల్యే బుడ్డా అనుచరుడు బి–ట్యాక్స్ వసూలు చేసినట్లు సమాచారం. అదేవిధంగా శివరాత్రి, సంక్రాంతి, ఉగాది, దసరా, కార్తీకమాసం, శ్రావణమాసం తదితర ప్రత్యేక పర్వదినాల సమయంలో పెండాల్స్, షామియానాలు, తాత్కాలిక విద్యుత్ దీపాల అలంకరణ, భక్తులకు ఇతర సదుపాయాల కల్పన కోసం పనులు చేసిన కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
దేవస్థానం ఆదాయానికి భారీగా గండి
కాంట్రాక్టర్లను సిండికేట్‌గా మార్చి కమీషన్లు వసూలు చేయడంలోనూ ఎమ్మెల్యే బుడ్డా అనుచరుడు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంట్రాక్టర్లను పిలిపించి ‘ఎవరు ఏ టెండర్ వేస్తారనేది ముందుగానే నిర్ణయించుకోండి. కేవలం 1 నుంచి 3 శాతం మాత్రమే నిర్ణీత ధర కన్నా తక్కువకు టెండర్ వేయండి. ఆ తర్వాత ఆఫీసులో నేను చూసుకుంటాను. మా కమీషన్ 7 శాతం ఇవ్వండి. మీరు పోటీ పడి 10 నుంచి 20 శాతానికి తక్కువకు టెండర్ వేసి నష్టపోవద్దు.’ అని హితబోధ చేస్తున్నట్లు తెలిసింది.
తద్వారా దేవస్థానం ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. మరోవైపు శ్రీశైలం క్షేత్రం వద్ద భక్తులకు ఉపయోగపడేలా సత్రాలు, ఇతర ప్రైవేట్ భవనాలను నిరి్మంచే దాతలను బెదిరించి కూడా బి–ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీశైలంలో 4స్టార్ హోటల్ నిర్మించతలపెట్టిన హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త నుంచి కూడా బి–ట్యాక్స్ వసూలు చేశారని సమాచారం.
బి–ట్యాక్స్ చెల్లించకపోతే దాడులే...
ఎమ్మెల్యే బుడ్డా అనుచరులకు బి–ట్యాక్స్ చెల్లించకపోతే కాంట్రాక్టర్లపై దాడులకు సైతం వెనుకాడటం లేదు. గతంలో దేవస్థానం నిర్వహించిన క్లోక్ రూమ్ టెండర్‌లో పాల్గొనేందుకు వచ్చిన సున్నిపెంటకు చెందిన ఓ కాంట్రాక్టర్‌పై దాడి చేసి పంపించారు.
తాజాగా ఈ నెల 11వ తేదీన తలనీలాలు పోగుచేసుకునే కాంట్రాక్టు కోసం రూ.50లక్షలు చొప్పున చెక్కులు తీసుకుని బహిరంగ వేలంలో పాల్గొనేందుకు దేవస్థానం పరిపాలన భవనం వద్దకు వచ్చిన కాంట్రాక్టర్లపైనా దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టారు. తమ ఎమ్మెల్యేతో మాట్లాడుకుని బేరం కుదుర్చుకున్న తర్వాతే రావాలని బెదిరించి పంపారు. ఇలా తరచూ కాంట్రాక్టర్లను బెదిరిస్తూనే ఉన్నారు.
బుడ్డా బొమ్మ ఉంటే టిప్పర్ ఆగదు
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీశైలం మండలంలో ఇసుక, కంకర ఎవరూ అమ్మకూడదని ఎమ్మెల్యే బుడ్డా అనుచరుడు హుకుం జారీ చేశారు. ఇసుక, కంకర అమ్మేవారిపై పోలీసు కేసులు పెట్టించి భయబ్రాంతులకు గురిచేశారు. అనంతరం ఇసుక, కంకర తన వద్దే కొనుగోలు చేసి అమ్ముకోవాలని చెప్పాడు.
టన్నుకు అదనంగా రూ.100ఇవ్వాలని ఆదేశించాడు. దీనికి వ్యాపారులు అంగీకరించడంతో ఇసుక, కంకర రవాణా కోసం ఆయన ఏకంగా టిప్పర్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ టిప్పర్లు ఎవరూ ఆపకుండా వాటిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఫొటోతో కూడిన స్టిక్కర్లను అతికించాడు. దీంతో ఎక్కడా వాటికి బ్రేకులు పడకుండా 24 గంటలూ తిరుగుతున్నాయి. మరోవైపు సున్నిపెంటలో ఉన్న రెండు మద్యం షాపుల నుంచి కూడా నెలకు రూ.2లక్షల చొప్పున వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


