పార్లమెంటు స్థాయీ సంఘం నివేదికకు ఎల్లో మీడియా వక్ర భాష్యం | Yellow media is giving a distorted interpretation to the Parliament Standing Committee report | Sakshi
Sakshi News home page

పార్లమెంటు స్థాయీ సంఘం నివేదికకు ఎల్లో మీడియా వక్ర భాష్యం

Dec 15 2025 3:58 AM | Updated on Dec 15 2025 4:01 AM

Yellow media is giving a distorted interpretation to the Parliament Standing Committee report

వైద్య కళాశాలలపై పీపీపీని స్థాయిసంఘం సమర్థించిందని  దుష్ప్రచారం  

కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలల ఆవశ్యకతను నొక్కివక్కాణించిన స్థాయీ సంఘం

వచ్చే ఐదేళ్లలో 75 వేల సీట్లు పెరిగితేనే విద్యార్థుల వలసల కట్టడి సాధ్యమని అభిప్రాయం

వైద్య విద్యలో అసమానతలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటని వెల్లడి

కొత్త కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వాలు కృషి చేయాలని సూచన

పీపీపీలో వైద్య కళాశాలల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి కేవలం పన్ను రాయితీలు చాలని ఉద్బోధ

దీనిని వక్రీకరించి చంద్రబాబుకు అనుకూలంగా కట్టుకథలు అల్లు తున్న ‘పచ్చ’పత్రిక  

వాస్తవానికి ఏపీలో నెలకొన్న అసమానతలను చెరిపేసేలా ఐదేళ్ల కిందటే వైఎస్‌ జగన్‌ విప్లవాత్మక సంస్కరణలు  

17 కళాశాలల ఏర్పాటుతో 2,550 ఎంబీబీఎస్‌ సీట్లు సమకూర్చేలా 2019లోనే అడుగులు 

సాక్షి, అమరావతి: దేశంలో వైద్యవిద్య నాణ్యతపై ఇటీవల పార్లమెంటు స్థాయీ సంఘం విడుదల చేసిన నివేదికకూ ఎల్లో మీడియా వక్రభాష్యం పలికింది. కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలల ఆవశ్యకత, ఎంబీబీఎస్‌ సీట్ల పెంపు అవసరాన్ని స్థాయి సంఘం నొక్కివక్కాణిస్తే.. పీపీపీ విధానాన్ని సమర్థించినట్టు కట్టుకథలల్లుతోంది. 

కొత్తగా కళాశాలలు ఏర్పాటుకు ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలకు కేవలం పన్ను రాయితీలు చాలన్న స్థాయీ సంఘం సూచనను వక్రీకరించి చంద్రబాబు ప్రైవేటీకకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చినట్టు దుష్ప్రచారం చేస్తోంది. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.  

అసలు స్థాయి సంఘం చెప్పిందేమంటే..! 
‘దేశంలో వైద్య విద్యకు ఉన్న పోటీకి తగ్గట్టుగా ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారుతోంది. సీట్లు పరిమితంగా ఉండటంతో దేశం వెలుపల ఎంబీబీఎస్‌ అభ్యసించడానికి వలస వెళ్లే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటోంది.’ అని పార్లమెంట్‌ స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం ఇప్పటికే ప్రకటించినట్టు వచ్చే ఐదేళ్లలో 75 వేల సీట్లు జోడిస్తే విద్యార్థులు వలసలు వెళ్లడానికి అవసరం ఉండదని దృఢంగా అభిప్రాయపడింది. దేశంలో వైద్య విద్య నాణ్యతపై ఇటీవల స్థాయీ సంఘం నివేదిక విడుదల చేసింది. 

ఆ నివేదిక దేశంలోని అనేక రాష్ట్రాల్లోని వైద్య విద్యలో అసమానతలను బట్టబయలు చేసింది.   దేశంలో వైద్య విద్యలో అసమానతలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటని స్పష్టం చేసింది. దేశం మొత్తం 1.10 లక్షల ఎంబీబీఎస్‌ సీట్ల పంపిణీలో రాష్ట్రాల మధ్య అసమానతలను ఎత్తి చూపింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రతి 10 లక్షల జనాభాకు 150కు దగ్గరగా ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా జాతీయ స్థాయిలో 75 సీట్లే ఉంటున్నాయని వివరించింది. 

10 లక్షల జనాభాకు 50 కంటే తక్కువ సీట్లున్న రాష్ట్రాలు ఉన్నాయని పేర్కొంది. అయితే ఆయా రాష్ట్రాల పేర్లను నివేదికలో వెల్లడించలేదు. జాతీయ స్థాయిలో 10 లక్షల జనాభాకు 100 సీట్ల నిష్పత్తిని సాధించడానికి మరో 40 వేల సీట్లు కొత్తగా సమకూర్చాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా 10 లక్షల జనాభాకు వంద కంటే ఎంబీబీఎస్‌ సీట్లున్న రాష్ట్రాలు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కృషి చేయాలని సిఫార్సు చేసింది. 

వైద్య కళాశాలలు అందుబాటులో లేని జిల్లాల్లో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, కళాశాలల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైద్య విద్యలో బోధన, బోధనేతర సిబ్బంది కొరత అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్య, ఆరోగ్య శాఖలకు పలు సూచనలు చేసింది. వైద్య విద్యలో అసమానతలు అధిగమించడంతోపాటు, నాణ్యత పెంపునకు స్థాయీ సంఘం చేసిన సిఫార్సులకు ఐదేళ్ల కిందటే వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో కార్యరూపం ఇచ్చిందని వైద్యవర్గాల్లో చర్చ ఊపందుకుంది. 

చంద్రబాబు సర్కారు గ్రహణం  
2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం బాబు గద్దెనెక్కడంతో మిగిలిన మెడికల్‌ కళాశాలలకు చంద్రగ్రహణం పట్టుకుంది. ఎక్కడికక్కడ గతేడాది జూన్‌ నుంచి నిర్మాణాలను ఆపేసి, పీపీపీలో వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టే కార్యక్రమానికి చంద్రబాబు తెరలేపారు. వైద్య విద్యపై బాబు చిన్న చూపు ఏపీ విద్యార్థులకు పెను శాపంగా మారింది. ఉమ్మడి ఏపీ నుంచి వేరుపడిన సందర్భంలో మన కంటే తెలంగాణలో తక్కువ సీట్లు ఉండేవి. 

ఇదిలా ఉండగా పదేళ్లలో ఆ రాష్ట్రంలో తొమ్మిది వేలకుపైగా ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2014లో కేంద్రంలోని ఎన్‌డీఏతో పొత్తులో ప్రభుత్వాన్ని నడిపిన బాబు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఒక్కటంటే ఒక్క కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేయలేదు. ఫలితంగా ఐదు కోట్లమందికిపైగా జనాభా ఉన్న ఏపీలో 2019–20లో 4,650 ఎంబీబీఎస్‌ సీట్లు మాత్రమే ఉన్నాయి. 

వీటిలో కేవలం రెండు వేల సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో ఉండగా, మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీల్లోవి. పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఏపీ కంటే ఎక్కువ సీట్లుండేవి. పోటీకి సరిపడా ఎంబీబీఎస్‌ సీట్లు లేక, ప్రైవేట్‌లో వైద్య విద్యను కొనే స్థోమత లేని వేల మంది విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్, కజికిస్తాన్‌ వంటి విదేశాలకు పరుగులు తీశారు. సామాన్య ప్రజలు సైతం ఉచిత సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందక తీవ్ర అగచాట్లు పడేవారు.   

పీపీపీ పేరిట దోచిపెట్టే కుట్రలు 
దేశంలో వైద్య విద్యను బలోపేతం చేసే క్రమంలో ప్రభుత్వాలు పీపీపీలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే సంస్థలకు పన్ను రాయి­తీలు ఇవ్వాలని పార్లమెంట్‌ స్థాయీ సంఘం సూచించింది. ఇదిలా ఉండగా చంద్రబాబు ప్రభు­త్వం రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ధి చేసిన బోధనాస్పత్రులను, తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలలను ప్రైవేట్‌ వ్యక్తులకు దోచిపెడుతోంది. 10 కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. 

ప్రభుత్వమే భూములు సేకరించి, టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించి, నిర్మాణాల్లో మంచి పురోగతి సాధించిన కళాశాలలను పప్పుబెల్లాల మాదిరిగా ప్రైవేటుకు కట్టబెట్టేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బాబు సర్కారు అవలంబిస్తున్న విధానం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పార్లమెంట్‌ స్థాయి సంఘం సైతం కొత్త కళాశాలల ఏర్పాటు కోసం కేవలం పన్ను రాయితీలు మాత్రమే ఇవ్వాలని సిఫార్సు చేయడం గమనార్హం. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా బాబు సర్కారు అడుగులు వేస్తోంది. 

అంతేకాకుండా విద్యార్థుల నుంచి ఫీజులు, రోగుల నుంచి చార్జీల రూపంలో దోచుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఎకరం భూమికి కేవలం రూ.100 లీజు రూపంలో ఏకంగా 66 ఏళ్ల పాటు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో కళాశాలలు పెట్టేస్తోంది. గతేడాది ప్రారంభం కాకుండా నిలిచిపోయిన పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని వైద్య కళాశాలలకు టెండర్లూ పిలిచింది. వాస్తవానికి పులివెందుల కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణం వైఎస్‌ జగన్‌ హాయంలోనే పూర్తయింది. 

ఈ నేపథ్యంలోనే బాబు ప్రభుత్వం ఏమీ చేయకున్నా పులివెందులకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) 2024–25లోనే 50 ఎంబీబీఎస్‌ సీట్లను మంజూరు చేసింది. అయితే కళాశాల మాకొద్దంటూ చంద్రబాబు సర్కార్‌ ఎన్‌ఎంసీకి లేఖలు రాసి, అనుమతులు రద్దు చేసింది. మిగిలిన మూడు కళాశాలలు ప్రారంభించకుండా వదిలేసింది. 

ఇప్పుడీ నాలుగింటిని తొలి దశలో ప్రైవేట్‌కు కట్టబెట్టడమే కాకుండా మరింత బరితెగించి, గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన బోధనాస్పత్రులను ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టబోతుంది. రెండేళ్ల పాటు ఈ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ఖజానా నుంచి వేతనాలు చెల్లించడం ద్వారా ప్రైవేట్‌ వ్యక్తులకు రూ.వందల కోట్లు దోచిపెట్టడానికి స్కెచ్‌ వేసింది.

దోపిడీ విధానాన్ని సమర్థించుకోవడానికి పాట్లు
పీపీపీ పేరిట దేశంలో ఎక్కడా లేనివిధంగా బాబు సర్కారు తెరలేపిన దోపిడీ విధానంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఉద్యమానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది. నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన నిరసన ర్యాలీలకు రాజకీయాలకు అతీతంగా విద్యార్థి, ప్రజా, మేధావి వర్గాలు తరలివచ్చాయి. ఈ నేపథ్యంలో తన దోపిడీ విధానాన్ని సమర్థించుకోవడానికి చంద్రబాబు సర్కారు నానా పాట్లు పడుతోంది. పార్లమెంట్‌ స్థాయి సంఘం సిఫార్సులకు  వక్రభాష్యం చెబుతోంది. 

వైద్య కళాశాలల అభివృద్ధిలో పీపీపీ విధానమే ఉత్తమం అంటూ తన ఆస్థాన మీడియాలో ప్రచారం చేయించుకుంటోంది. అయితే పార్లమెంట్‌ స్థాయి సంఘం ఎక్కడా ప్రభుత్వం నిర్మించిన, నిర్మాణం ప్రారంభించిన కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టాలని చెప్పనే లేదు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. మసిబూసి మారేడుగాయ చేయడంలో ఆరితేరిన చంద్రబాబు పార్లమెంట్‌ స్థాయి సంఘంలోని చిన్న అంశాన్ని ఆయుధంగా మలుచుకుని తాను చేసేదే కరెక్ట్‌ అన్నట్టు వక్రీకరించేస్తున్నారు.

పీపీపీ తప్పితే ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు నిర్వహించడం వేస్ట్‌ అన్నట్టుగా తప్పుడు ప్రచారాన్ని మరింత విస్తృతం చేసే పనిలోపడ్డారు. ప్లగ్‌ ప్లే తరహాలో తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడుతూ పీపీపీనే ఉత్తమ విధానం అంటూ సమర్థించుకోవడానికి తెగ తాపత్రయపడుతున్నారు.   

ఐదేళ్ల కిందటే వైఎస్‌ జగన్‌ కార్యరూపం 
ప్రతి 10 లక్షల జనాభాకు 50 కంటే తక్కువ సీట్లు రాష్ట్రాలు కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని స్థాయి సంఘం ప్రభుత్వాలకు సూచించింది. వైద్య సౌకర్యాలు సరిగా లేని జిల్లాల్లో కళాశాలలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రైవేటులో వైద్య విద్యను అభ్యసించడానికి రూ. కోట్లలో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్న క్రమంలో సామాన్య విద్యార్థుల తెల్లకోటు కల సాకారం చేసే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పింది. 

పార్లమెంట్‌ స్థాయీ సంఘం ఇప్పుడు చేసిన సిఫార్సులకు ఐదేళ్ల కిందటే, అంటే 2019లోనే వైఎస్‌ జగన్‌ కార్యరూపంలోకి తీసుకొచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసి, ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తానన్న హామీని అమలు చేస్తూ ఏకంగా రూ.8వేల కోట్లకుపైగా నిధులతో 17 కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 

అప్పటి వరకూ ఒక్క ప్రభుత్వ/ప్రైవేట్‌ వైద్య కళాశాల లేని పల్నాడు, ఏఎస్‌ఆర్, బాపట్ల, అన్నమయ్య, సత్యసాయి, అనకాపల్లి, పార్వతీపురం మన్యం ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్‌స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేసే దిశగా అడుగులు వేశారు. మరోవైపు ప్రైవేట్‌ వైద్య కళాశాలే తప్ప ప్రభుత్వ రంగంలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందని నంద్యాల, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లోనూ కొత్త వైద్య కళాశాలలు నెల­కొల్పడానికి నడుం బిగించారు. 

వీటితోపాటు కృష్ణా జిల్లా మచిలీపట్నం, కర్నూల్‌ జిల్లా ఆదోని, వైఎస్సార్‌ జిల్లా పులివెందుల, ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో కొత్త కళాశాలల నిర్మాణాలను కరోనా సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని అధిగమించి ప్రారంభించా­రు. 2023లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, 2024లో పాడేరు వైద్య కళాశాలను ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement