సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ గుండాలు రెచ్చిపోయారు. మర్లపాలెం గ్రామంలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిశారని.. స్థానికంగా అధికార పార్టీ కొనసాగిస్తున్న అరాచకాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారనే కోపంతోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ఆదివారం మధ్యాహ్నాం మర్లపాలెంలో వల్లభనేని వంశీ పర్యటించి.. ఓ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన కంభంపాటి శ్రీధర్,కంభంపాటి రామ్మోహనరావు వంశీని కలిసి ఫొటోలు దిగారు. స్థానికంగా కొనసాగుతున్న ప్రతీకార రాజకీయాల గురించి ఆయనకు వివరించారు. ఈ విషయం తెలిసిన టీడీపీ మూక రెచ్చిపోయింది.
ఆ ఫొటోల ఆధారంగా ఇద్దరిని గుర్తించింది. వంశీనే కలుస్తారా? అంటూ.. ఇరువురిపై మూక దాడికి పాల్పడ్డారు. తల, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో శ్రీధర్, రామ్మోహనరావులను స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వల్లభనేని వంశీ.. హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన.. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.



