హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడతలో.. తొలి విడత పలితాలే పునరావృతం అయ్యాయి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నారు. అయితే మహబూబ్ నగర్‌లో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి తన సొంతూరులోనే షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. రంగారెడ్డిగూడ సర్పంచ్‌గా బీజేపీ అభ్యర్థి రేవతి ఆనంద్ విజయం సాధించారు. మరోవైపు.. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డికీ ఇదే తరహా అనుభవం ఎదురైంది.
ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన సొంతూరు ధన్వాడలో బీజేపీ అభ్యర్థి జ్యోతి రామచంద్రయ్య ఘన విజయం సాధించారు. ధన్వాడ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు కూడా సొంతూరు కావడం, పైగా పర్ణికారెడ్డికి అత్తాకోడళ్ల వరుస.. దీనికి తోడు ధన్వాడలో పోటీ పడింది కూడా అత్తాకోడళే కావడం.. ఈ ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇటు ఖమ్మంలోనూ కాంగ్రెస్‌కు ఎదురుగాలి తప్పలేదు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆది నారాయణ ప్రచారం చేసిన వాటిల్లో కేవలం రెండు చోట్ల (ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి) మాత్రమే కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా నెగ్గారు.
రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో.. 55% స్థానాల్లో అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులదే విజయం సాధించారు. బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థుల్లో 29% మంది గెలుపొందగా.. తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. అదే సమయంలో స్వతంత్రులు కూడా సత్తా చాటారు. రెండో విడతకు సంబంధించి 416 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలంగాణలోని 193 మండలాల్లోని 3911 పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించగా..
కాంగ్రెస్-2,112
బీఆర్‌ఎస్-1,025
బీజేపీ-225
ఇతరులు(స్వతంత్రులు.. సీపీఐ-సీపీఎం బలపర్చినవాళ్లు)-549 గెలుపొందారు.
రెండో విడతలో 85.86% పోలింగ్ నమోదు కాగా.. ఇది తొలి విడత కంటే 1.58% ఎక్కువ. ఇప్పటి వరకు రెండు విడతల్లో ఇప్పటివరకు 8,567 పంచాయతీల ఎన్నికలు పూర్తైంది. రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపర్చగా గెలిచిన వారి సంఖ్య 5,195, బీఆర్ఎస్ మద్దతుదారులు 2,338, బీజేపీ 440గా ఉన్నారు. బీజేపీ కంటే ఇతరులు సాధించిన స్థానాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 17వ తేదీన తుది దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.


