కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆగ్రహం
ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ‘ఓటు చోర్–గద్దీ చోడ్’ మహాధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: అసత్యం, ఓట్ల చోరీ బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ డీఎన్‌ఏలోనే ఉన్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. సత్యం, అహింస అనే నినాదంతో బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ప్రతిన బూనారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు చోర్–గద్దీ ఛోడ్’మహాధర్నాలో రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు సోనియా గాం«దీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాం«దీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సుఖూ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బీజేపీతోపాటు ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో రాహుల్ గాంధీ విచుచుకుపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీల పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ వారంతా బీజేపీ కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు అధికారం అండతో విచ్చలవిడిగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని అనుసరించేవారి డీఎన్‌ఏలో సత్యం ఉంటుందన్నారు. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ డీఎన్‌ఏలో మాత్రం అసత్యం, ఓట్ల చోరీ మాత్రమే ఉంటాయని తేల్చిచెప్పారు.
సత్యానికి, అసత్యానికి మధ్య పోరాటం
‘‘సత్యమే మన ఆయుధం. సమయం పట్టొచ్చు గానీ ఎప్పటికైనా సత్యానిదే విజయం. ప్రపంచం సత్యాన్ని పట్టించుకోదని, అధికారాన్ని, బలాన్ని మాత్రమే చూస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత భాగవత్ చెప్పడం దారుణం. బీజేపీ కోసమే ఎన్నికల సంఘం పనిచేస్తున్న సంగతి నిజం కాదా? ఎన్నికల కమిషనర్లను కాపాడేందుకు ప్రధాని మోదీ కొత్త చట్టం తీసుకొచ్చారు. మేమే వచ్చాక ఈ చట్టాన్ని తప్పనిసరిగా మారుస్తాం’’ అని అన్నారు.
దొంగతనమే వారి డీఎన్‌ఏ
దొంగతనం బీజేపీ డీఎన్‌ఏలో ఉందని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. డబ్బు దొంగతనం, భూమి దొంగతనం, వ్యవస్థల దొంగతనం, హక్కుల దొంగతనం, ఉద్యోగాల దొంగతనం, ప్రజా తీర్పును దొంగిలించడం, ప్రభుత్వాన్ని దొంగిలించడం, ఎన్నికలను, ఓట్లను దొంగిలించడం బీజేపీకి అలవాటేనని ధ్వజమెత్తారు. ప్రజలను దోచుకొని అధికారం అనే నిచ్చెనపైకి ఎగబాకడం బీజేపీ విధానమని దుయ్యబట్టారు.
ప్రజల కోసమే రాహుల్ పోరాటం: ఖర్గే
ప్రజల కోసమే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆయనను బలపర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓట్ చోర్–గద్దీ ఛోడ్ ధర్నాలో ఖర్గే ప్రసంగించారు. రాహుల్ గాం«దీకి మద్దతు ఇవ్వకుంటే దేశానికి నష్టం జరుగుతుందన్నారు. దేశాన్ని, ఓటు హక్కును, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మనమంతా కలిసి పోరాటం చేయాలన్నారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతం, భావజాలం దేశాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. హిందూమతం, హిందుత్వం పేరుతో పేదలను బానిసలుగా మార్చడానికి ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్న బీజేపీని అధికారం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. దేశాన్ని కాపాడగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. దేశ ద్రోహులైన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలకు, ఓట్ల దొంగలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి మరింత బలోపేతం చేయాలని ప్రజలకు ఖర్గే విజ్ఞప్తి చేశారు.
బ్యాలెట్ పేపర్లతో గెలిచే దమ్ముందా?
బ్యాలెట్ పేపర్లతో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి గెలిచే దమ్ముందా? అని బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సవాలు విసిరారు. ఓట్ల చోరీపై ఎన్నికల సంఘం ఏదో ఒకరోజు దేశ ప్రజలకు సమాధానం చెప్పక తప్పదని అన్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ అనుమానాస్పదంగా సాగుతోందని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును కూడా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం సహకరించకపోతే ఎన్నికల్లో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ నెగ్గలేదని తేల్చిచెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలన్నీ మోదీ సర్కార్ ఎదుట మోకరిల్లుతున్నాయని ఆరోపించారు.


