కార్డియాక్ అరెస్టు రోగులపై అధ్యయనంలో వెల్లడి
ఎన్‌ఎఫ్‌ఎల్ పరీక్షతో 92% కచ్చితత్వంతో ఫలితాలు
యూరప్‌లో 819 మందిపై సాగిన అధ్యయనం
ప్రస్తుత పరీక్షల కన్నా మెరుగ్గా 24 గంటల్లోనే ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: కార్డియాక్ అరెస్టు (గుండె స్తంభించడం) నుంచి బయటపడిన రోగుల్లో మెదడు పనితీరుకు సంబంధించిన నష్టాన్ని కచ్చితత్వంతో అంచనా వేయడానికి కొత్త తరహా రక్త పరీక్ష న్యూరోఫిలమెంట్ లైట్ (ఎన్‌ఎఫ్‌ఎల్)ఉపయోగపడనుందని అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది.
మల్టిపుల్ స్క్లెరోసిస్ (రోగనిరోధక శక్తికి సంబంధించిన వ్యాధి) రోగుల్లో ఇప్పటికే వినియోగిస్తున్న ఎన్‌ఎఫ్‌ఎల్ బయో మార్కర్ కార్డియాక్ అరెస్టు రోగుల విషయంలోనూ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. స్వీడన్‌లోని ఓ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ నేతృత్వంలో యూరప్‌కు చెందిన 24 ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 819 మంది రోగులపై ఈ పరిశోధన జరిగింది.
‘ది లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్’ జర్నల్‌లో డిసెంబర్ 11న ప్రచురితమైన ఈ అధ్యయనంలో, కార్డియాక్ అరెస్టు తర్వాత ఆరు నెలలకు రోగుల పరిస్థితిని అంచనా వేయడంలో ఎన్‌ఎఫ్‌ఎల్ బయో మార్కర్ 92 శాతం కచ్చితత్వాన్ని చూపినట్లు వెల్లడైంది. ముఖ్యంగా కార్డియాక్ అరెస్టు జరిగిన 24 గంటల్లో రోగి మెదడుకు వాటిల్లిన నష్టం స్థాయిని అంచనా వేసే అవకాశం ఈ కొత్త పరీక్షతో లభిస్తుందని పరిశోధకులు తెలిపారు.
24 గంటల్లోనే ఫలితాలు
ఎన్‌ఎఫ్‌ఎల్ బయో మార్కర్ ప్రత్యేకత ఏమిటంటే, కార్డియాక్ అరెస్టు జరిగిన తర్వాత జరిపే ఈ పరీక్ష ఫలితాలు 24 గంటల్లోనే అందుబాటులోకి వస్తాయి. దీంతో ఐసీయూ వైద్యులు తొలిదశలోనే రోగి పరి స్థితిపై స్పష్టమైనఅవగాహన పొందగ లుగుతారని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న న్యూరాన్– స్పెసి ఫిక్ ఎనోలేస్ (ఎన్‌ఎస్‌ఈ), ఎస్–100 ప్రోటీ న్ వంటి బయో మార్కర్లకు కొన్ని పరిమితు లు ఉన్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ నిక్లాస్ నిల్సన్ తెలిపారు. మొత్తంగా నాలుగు రకాల బయో మార్కర్లతో పోల్చినప్పుడు ఎన్‌ఎఫ్‌ఎల్ మిగతా మూడింటికంటే మెరుగైన పనితీ రును చూపిందని అధ్య యనం రచయిత మారియోన్ మోసెబీ నాపే వెల్లడించారు.
తీవ్రత గుర్తింపులో స్పష్టత
ఎన్‌ఎఫ్‌ఎల్ బయో మార్కర్ మెదడుకు జరిగిన నష్టం తీవ్రతను స్పష్టంగా గుర్తిస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. కాగా ‘గ్లియల్ ఫైబ్రిల్లరీ ఆసిడిక్ ప్రోటీన్ –జీఎఫ్‌ఏపీ’ అనే మరో బయో మార్కర్ కూడా ప్రస్తుతం వాడుతున్న పరీక్షల కంటే మెరుగైన ఫలితాలు చూపుతున్నట్టుగా తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ అధ్యయనంలో రోగులను ఆసుపత్రిలో చేర్చిన సమయంలో, 24 గంటలు తర్వాత, 48 గంటలు, అలాగే 72 గంటల తర్వాత రక్త నమూనాలు సేకరించి విశ్లేషించారు.
ఈ పరీక్ష ద్వారా రోగికి చికిత్స కొనసాగించాలా లేదా పల్లియేటివ్ కేర్ (సంరక్షణ విభాగం)కు మార్చాలా అనే క్లిష్ట నిర్ణయాల్లో వైద్యులకు కీలక మార్గనిర్దేశం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కార్డియాక్ అరెస్టు రోగుల సంరక్షణలో ఇది గణనీయమైన మార్పు తీసుకువస్తుందని అంటున్నారు.


