కర్ణాటక: ఇక్కడ అంతా రివర్స్ అయ్యింది. ఓ పురుష సీఐని మహిళ ప్రేమపేరుతో వేధిస్తోందని తెలిసింది. బెంగళూరులోని రామమూర్తినగర ఠాణా సీఐ సతీష్ కి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. తాను అధికార కాంగ్రెస్ పార్టీ నాయకురాలినని, ప్రేమించకపోతే ఇబ్బంది పడతావని కూడా బెదిరిస్తూ ప్రముఖులతో తీసుకున్న ఫోటోలను వాట్సాప్‌లో పంపి సతాయిస్తోంది.
ఎలా మొదలైంది..
సదరు మహిళ పని మీద ఒకటి రెండుసార్లు ఠాణాకు వచ్చి సీఐతో మాట్లాడింది, అంతే అప్పటి నుంచి ఆయనంటే మోజు పడింది. ప్రేమగా కజ్జికాయల డబ్బా, పూల బొకే తీసుకుని సీఐ కోసం వస్తుంది. మొదట్లో మామూలే కదా అనుకున్న సీఐకి తరువాత సీరియస్ అని అర్థమైంది. సుమారు 11 నంబర్ల నుంచి ఫోన్ చేసి, ప్రేమించాలని డిమాండ్ చేస్తోందని ఠాణా సిబ్బంది చెబుతున్నారు. నన్ను ప్రేమించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని, మీరే కారణమని డెత్‌నోట్ రాస్తాను అని బెదిరిస్తూ రక్తంతో మరో లేఖను రాసింది.
మహిళపై కేసు
ఈ చర్యలతో విసుగెత్తి ఇన్స్‌పెక్టర్ సతీశ్.. తన విధులకు అడ్డుపడుతున్న, ఆత్మహత్య బెదిరింపులకు పాల్పడుతున్న సెక్షన్ల కింద ఆమె మీద కేసు నమోదు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు.


