ఉపాధి హామీ ఉసురు తీయొద్దు
● అసెంబ్లీ ఆవరణలో సీఎం, డీసీఎంల ధర్నా
శివాజీనగర: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (నరేగా) నుంచి గాంధీ పేరును తొలగించిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెళగావిలో సువర్ణసౌధ ఆవరణంలో ఉన్న గాంధీ విగ్రహం ముందు సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. బుధవారం ఉదయాన్నే ధర్నా నిర్వహించి కేంద్రానికి విరుద్ధంగా నినాదాలను చేశారు. పేరును మార్చడం ద్వేషపూరిత రాజకీయం, దీనిని తాము ఖండిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నీచమైన రాజకీయానికి పాల్పడుతోందన్నారు. పేరు మార్చడంతో పాటు పథకం స్వరూపాన్నే మార్చేశారు, రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు వాటాను పెంచారు, ఇది సరికాదు. గతంలో మాదిరిగానే ఉపాధి పథకాన్ని కొనసాగించాలని నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ధర్నాపై బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి విమర్శలు గుప్పించారు. నెహ్రూ కాలంలోనే గాంధీజీ విధానాలకు కాంగ్రెస్ తిలోదకాలు ఇచ్చిందన్నారు. తుక్‌డా గ్యాంగ్‌తో కలసి దేశాన్ని విడదీయటానికి కుట్ర చేస్తోందన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు గాంధీజీ జ్ఞాపకం రాలేదా అని విమర్శించారు.


