బైక్, కారుకు లారీ ఢీ.. నలుగురు మృతి
హోసూరు: బెంగళూరు – సేలం హైవేలో తొప్పూరు వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. ధర్మపురి జిల్లా తొప్పూరు వద్ద జాతీయ రహదారిపై వెళుతున్న బైక్, కారును లారీ ఢీకొట్టింది, ఆ రెండు వాహనాల్లోని నలుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తొప్పూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనపరుచుకొని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను సరిచేశారు. మృతుల వివరాల కోసం విచారణ జరుపుతున్నారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. ఈ దుర్ఘటనతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఇక్కడ ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


