ఆగని గర్భిణుల మరణ మృదంగం
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని బళ్లారి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ప్రారంభమైన నిండు గర్భిణుల మృతుల ఉదంతం రాయచూరు జిల్లాకు పాకింది. బళ్లారి జిల్లా ఆస్పత్రిలో గర్భిణి మహిళల మృతి అంశం మరువక ముందే రాయచూరు జిల్లాలో ఈనెల 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఐదుగురు నిండు గర్భిణులు మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. సింధనూరు, దేవదుర్గల్లోని ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు సక్రమంగా అందక, చికిత్స ఫలించక ఇద్దరు చొప్పున మరణించారు. సింధనూరులో చంద్రకళ(26), రేణుకమ్మ(32), దేవదుర్గలో మౌనమి(22), చెన్నమ్మ(25) మృత్యువాత పడ్డారు. మరో వైపు దేవదుర్గ తాలూకా జాగీర్ జాడలదిన్నికి చెందిన మహాదేవి(28) కూడా సిరవార ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించింది. గత వారం పది రోజులుగా రిమ్స్‌లో చేరిన గర్భిణుల్లో నలుగురికి వైద్యులు సిజేరియన్ చేశారు.


