వీధి కుక్కలను ఆశ్రయ కేంద్రాలకు తరలిస్తాం
కోలారు : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధి కుక్కలను తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలకు తరలిస్తామని జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.రవి తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సభాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 79,281 వీధి కుక్కలు ఉన్నాయన్నారు. ఈ కుక్కలను బంధించి సంతాన హరణ చికిత్స చేయించి ఆశ్రయ కేంద్రానికి తరలిస్తామన్నారు. వంద కుక్కల ఆశ్రయ కేంద్రానికి నెలకు రూ.3.33 లక్షల ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. ఆశ్రయ కేంద్రాల్లోని క్కులకు నిత్యం రెండు పూటలా భోజనం, మందులు, టీకాలు వేయిస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ ఉప కార్యదర్శి టి కె రమేష్, అదనపు జిల్లా కలెక్టర్ మంగళ, నగరసభ కమీషనర్ నవీన్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.


