20, 21న క్రికెట్ టోర్నీ
● వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్ ఏర్పాట్లు
బనశంకరి: జన నేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. గతంలోనూ రెండు సీజన్లు నిర్వహించడం తెలిసిందే. ఈ సారి కూడా అదే ఉత్సాహంతో ఐటీ వింగ్ సీజన్ –3 క్రికెట్ టోర్నీ జరుపుతున్నట్లు ఐటీ వింగ్ నేతలు తెలిపారు. ఈ నెల 20, 21 తేదీల్లో బెంగళూరు సర్జాపురలో చేతన్ క్రికెట్ గ్రౌండ్స్‌లో టోర్నమెంట్ జరుగుతుంది. ప్రేక్షకులు, జట్లు విరివిగా పాల్గొని, ఆడేవారిని ప్రోత్సహించండి అని విజ్ఞప్తి చేశారు. జననేత బర్త్ డేని అభిమానంతో సగర్వంగా సెలబ్రేట్ చేసుకుందామని పిలుపునిచ్చారు. క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనాలని ఆసక్తి కలిగినవారు ముందుగా వివరాలను తెలియజేయాలి. మరిన్ని వివరాలకు రమేశ్– 974330 0010 నంబరులో సంప్రదించాలని తెలిపారు.
బీకాం విద్యార్థిని ఆత్మహత్య
శివమొగ్గ: జిల్లాలోని హొసనగర తాలూకాలోని వసవె గ్రామంలో బీకాం విద్యార్థిని ఒకరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వసవె గ్రామ నివాసి రచన (20), హొసనగరలోని కొడచాద్రి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీకాం చదువుతోంది. ఎప్పటిలానే కాలేజీకి వెళ్లి వచ్చిన రచన ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నట్లు తెలిసింది. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. కూతురి మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు.
గుండెపోటుకు యువతి బలి
శివమొగ్గ: తగ్గాయనుకున్న ఆకస్మిక గుండెపోటు మరణాలు మళ్లీ దడ పుట్టిస్తున్నాయి. జిల్లాలో తీర్థహళ్లికి చెందిన అమ్మాయి గుండెపోటుకు బలైంది. మృతురాలిని దిశ (22)గా గుర్తించారు. శృంగేరిలోని జేసీబీఎం కాలేజీలో ఫైనలియర్ బీకాం చదువుతున్న దిశ శృంగేరిపేటెలోని బీసీఎం హాస్టల్‌లో ఉండేది. హాస్టల్‌లో ఉండగానే దిశకు ఆకస్మికంగా ఎదలో నొప్పి వచ్చి కుప్పకూలిపోయింది. కొంతసేపటికి ఇతర విద్యార్థినులు వచ్చి చూడగా అప్పటికే తుదిశ్వాస విడిచింది. అధ్యాపకులు, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు శోకతప్తులయ్యారు. శృంగేరి పోలీసులు కేసు నమోదు చేశారు.
20, 21న క్రికెట్ టోర్నీ


