చీర గొప్పతనం గురించి మన తెలుగు పాటలతో.. ఎంతో మంది గాయకులు, రచయితలు అద్భుతం వర్ణించి రాశారు, పాడారు. అలాంటి చీర అత్యంత ఖరీదైనదిగా, కళఖండంగా రికార్డు సృష్టించింది ఆ చీరలో దాగున్న విశేషాలు చూస్తే..కంగుతింటారు. అడుగడుగున ఓ కళా ప్రతిరూపం, ఓ ప్రత్యేకత, ఓ ప్రసిద్ధ చిత్రకారుడు కుంచె నుంచి జాలువారిని చిత్రాలు, అమూల్యమైన ఆభరణాలు, నగలు కనిపిస్తాయి. అంతేగాదు చీరను చూడగానే "సరికొత్త చీర ఊహించినాను" అన్న పాట స్పురణకు వస్తుంది. అంత గొప్పగా తీర్చిదిద్దారు ఈ శారీని. దీని ఖరీదు లక్షలు పైమాటే..అంటే ఈ చీర ధరతో పల్లెటూరిలో ఓ మోస్తారు ఇల్లు కట్టేయొచ్చు లేదా ఓ మారుమూల ప్రాంతంలో సింగిల్ బెడ్‌రూం ధర అని కూడా చెప్పొచ్చు.
ప్రపంచం చీరల దినోత్సవం సందర్భంగా..అత్యంత ఖరీదైన వివాహ పట్టు చీర, కళలకు నిలయమైన చెన్నై సిల్క్ కంజీవరం పట్టు చీర విశేషాలు గురించి తెలుసుకుందామా. ఈ చీర గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కించుకుంది. దీన్ని డబుల్ వార్ఫ్ పద్ధతిని ఉపయోగించి చేతితో నేసిన చీర. దీనిలో 64 రంగుల షేడ్స్, పది ప్రత్యేకమైన డిజైన్లు ఉంటాయి. ఈ చీర బరువు వచ్చేసి దగ్గర దగ్గరగా ఎనిమిది కిలోగ్రాములు.
దీనిలో బంగారం, వజ్రం, ప్లాటినం, వెండి, కెంపు, పచ్చ, నీలమణి, ముత్యాలు వంటి విలువైన రాళ్లను పొందుపరిచారు. నివేదికల ప్రకారం.. 59.7 గ్రాముల బంగారం, 3.9 క్యారెట్ల వజ్రం, 5 క్యారెట్ల నీలమణిని వినియోగించారు. అంత విలువైన వజ్రాలు, కళాఖండాలకు నిలయం కావడంతోనే ఈ చీర గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది.
ఇది జనవరి 05, 2008న సుమారు రూ. 39 లక్షలు పైచిలుకే అమ్ముడుపోయింది. ఈ చీర తయారీకే దాదాపు 4 వేలు గంటలు పనైనే పట్టిందట. మొత్తం 36 మంది నేత కార్మికుల కృషి ఫలితం ఈ చీర. మరో విశేషం ఏంటంటే..ఇందులో ప్రఖ్యాత భారతీయ కళాకారుడు రాజా రవి వర్మ 11 చిత్రాల ప్రతిరూపాలు ఉన్నాయి. ఆ శారీ పల్లులో 'గెలాక్సీ ఆఫ్ మ్యూజిషియన్స్' ప్రతిరూపం ఉంటుంది. ఇది సంగీత ప్రదర్శనలో నిమగ్నమైన 11 మంది మహిళలను వర్ణిస్తుంది. ఇందులో ప్రతి స్త్రీ ఒక ప్రాంతం లేదా కమ్యూనిటికి సంబంధించిన విభిన్న దుస్తులను ధరించి కనిపించడం మరింత విశేషం. కుడివైపు ఒక ముస్లీం మహిళ, ఎడమవైపు ఒక స్త్రీ నాయర్ ముండు దుస్తులను(కేరళ నాయర్ సామాజికి వర్గానికి సంబంధించిన స్త్రీలు) ధరించి చేతిలో వీణ వాయిస్తూ కనిపిస్తుంది.
మధ్యలో ఆకుపచ్చ గాజులతో మరాఠీ శైలి చీర ధరించిన స్త్రీ కనిపిస్తుంది. ఇంతలా వివవరణాత్మక పెయింటింగ్ చీరపై చిత్రించడంతనే ఈ చీర అత్యంత హైలెట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. అయితే ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న ఈ చీరను రెండు వెర్షన్లలో తయారు చేసినట్లు సమాచారం. ఒకటి బెంగళూరుకి చెందిన ఒక వ్యాపారవేత్త తన పదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొనుగోలు చేయగా, మరొకటి 2009లో కువైట్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త కొనుగోలు చేశారట.
(చదవండి: Nita Ambani: ఎరుపు చీర, బాస్రా ముత్యాల నెక్లెస్‌లో నీతా అంబానీ మెస్మరైజ్ లుక్..!)


