ఏదైనా ప్రత్యేక సందర్భం అనగానే మహిళలకు ముందుగా గుర్తొచ్చే దుస్తులు చీర. అలా కెనడా పౌరసత్వం తీసుకునే సందర్భంగా మహారాష్ట్రకు చెందిన మహిళ ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా నిలిచిపోవాలని భావించింది. తమ ప్రాంతానికి చెందిన చీర, ముస్తాబులో స్పెషల్‌గా కనిపించాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది పలువురిని ఆకట్టుకుంటోంది.
మహారాష్ట్రకు చెందిన దివ్య లాట్లికర్ కెనడా పౌరసత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి నౌవారీ చీరతో హాజరై అందర్నీ ఆకర్షించారు. తన సొంత రాష్ట్రం నుండి వచ్చిన సాంప్రదాయ చీరను ధరించి, నుదిటిపై బిందీతో ముస్తాబైంది. ఈ వేడుకును ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పంచకుంది. నౌవారీ చీర ధరించడం తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన క్షణాలలో ఒకటని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ చీర బలం, గౌరవం, సహనం, కొనసాగింపుకు చిహ్నం అని ఆమె అన్నారు. పౌరసత్వ ప్రమాణాన్ని స్వీకరిస్తూ, సర్టిఫికేట్ అందుకుంటున్న ఆ క్షణం ఆమెలో ఇన్నేళ్ల కృషి, సంకల్పం ప్రతిబింబించింది.
ఇదీ చదవండి: నిపా వైరస్ కలకలం : ఎయిర్‌పోర్ట్స్‌లో హై అలర్ట్
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకుంటూ, దివ్య దేశం పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది. తాను ఉన్న చోట ఉండటం గర్వంగా ఉందని, అలాగే ఏ దేశమేగినా, పుట్టిన నేలను మర్చిపోకూడదని, మూలాలను సజీవంగా ఉంచుకోవడం తనకెంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు.
ఆ వేడుకలో ఆమె ధరించిన చీర, సాంప్రదాయ వేషధారణపై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసలు కురిపించారు. చాలా సహజంగా, అందంగా ఆత్మవిశ్వాసంతో కనిపించారంటూ దివ్యను కొనియాడారు. అచ్చమైన మరాఠీ అమ్మాయిలా ఉన్నారన్నారు. అలాగే తన అమెరికా పౌరసత్వ స్వీకరణ సందర్బంగా తాను కూడా మరాఠీ దుస్తులు ధరిస్తానని, మంచి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ మరొకరు వ్యాఖ్యానించడం విశేషం.


