మహిళా రైతులకు మద్దతిస్తే..! | women in the agriculture sector should get a greater role | Sakshi
Sakshi News home page

మహిళా రైతులకు మద్దతిస్తే..!

Mar 13 2026 5:08 PM | Updated on Mar 13 2026 5:08 PM

women in the agriculture sector should get a greater role

ఒక మహిళా రైతు సాధికారితను పెంపొందిస్తే (అంటే, మద్దతు ఇస్తే లేదా బలోపేతం చేస్తే).. ఏమవుతుంది? ఆ కుటుంబం, సమాజం బాగుపడుతుంది. ఇందుకోసమే 2026 అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (యూఎన్‌–ఎఫ్‌ఏఓ) మహిళా రైతుల సాధికారితపై నాలుగు మాటల్లో ఏమంటోందో చూద్దాం..

మీకు తెలుసా? దాదాపు ప్రతి గ్రామీణ మహిళ ఒక కార్మికురాలే, తిని కూర్చునే వారెవరూ లేరు! ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం, 2021లో ప్రపంచ వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి, పంపిణీ రంగాల్లో పనిచేస్తున్న వారిలో మహిళలు 41% ఉన్నారు. అయినప్పటికీ గ్రామీణ మహిళలు అసమానతలను ఎదుర్కొంటున్నారు. వారి ఉపాధికి గ్యారంటీ లేదు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. హక్కులను పరిమితంగా మాత్రమే పొందగలుగుతున్నారు.

ఆదాయం వచ్చే పొలం పనుల కన్నా ‘వేతనం లేని కుటుంబ సంరక్షణ పనుల’కు మహిళా రైతులు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఇది లేబర్‌ మార్కెట్‌లో వారి విలువను తగ్గిస్తోంది. ఆర్థిక సాధికారత తగ్గిపోతోంది. ఈ పరిస్థితులు మహిళా రైతులకు అంత శ్రేయస్కరంగానూ లేదు. ప్రపంచవ్యాప్తంగా, మహిళలు, బాలికలు చేసే కుటుంబ సంరక్షణ పనులకు విలువ కడితే ఎంతవుతుందో తెలుసా? ఏడాదికి ఏకంగా రూ.9,95,264 కోట్లు అవుతుంది!

మహిళా రైతులు సాధారణంగా పురుషుల కంటే చిన్న కమతాల్లోనే పంటలు పండిస్తున్నారు. పురుషులతో సమానమైన విస్తీర్ణం గల పొలాల్లో పంటలు పండిస్తున్న చోట్ల కూడా.. మహిళా రైతులకు వనరుల లభ్యత, వ్యవసాయ శిక్షణ, సలహాల అందుబాటు అరకొరగా అందుతుండటంతో ఉత్పాదకతలో వెనుకబడుతున్నారు. వీరి ΄పొలాల్లో పంటల దిగుబడి 24% తక్కువగానే వస్తోందని బెంగళూరుకు చెందిన ‘ఫౌండేషన్‌ ఫర్‌ అగ్రేరియన్‌ స్టడీస్‌’ చెబుతోంది.

ఆహార అభద్రత పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ. ప్రపంచం లో ఏ ప్రాంతంలో చూసినా పరిస్థితి ఇలాగే ఉంది. ఉపాధి, విద్య, ఆదాయంలో లింగపరమైన వివక్షలను తొలగించటం ద్వారా ఈ అంతరం 52% పోతుందని నిపుణులు చెబుతున్నారు.

మన దేశంలో మహిళా రైతుల పరిస్థితేమిటి?
ఫౌండేషన్‌ ఫర్‌ అగ్రేరియన్‌ స్టడీస్‌ సర్వేల (2017–18) ప్రకారం, వ్యవసాయ సీజన్‌లో 92% గ్రామీణ మహిళలు ఆదాయం వచ్చే వ్యవసాయ పనులు చేస్తున్నారు. పనులు అంతగా ఉండని సీజన్‌ లో కూడా 64% మంది ఏదో ఒక పని చేస్తున్నారు. ఏడాది పొడవునా గ్రామీణ మహిళలు చాలా మంది పనిలో నిమగ్నం అవుతున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

పాడి పనుల్లో నిమగ్నమయ్యే వారిలో దాదాపు 70% మంది మహిళలే. అయినప్పటికీ ఈ రంగం యొక్క అసంఘటిత స్వభావం కారణంగా వారి పనిని చాలా సార్లు చిన్న చూపు చూస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకారం, 2022–23లో, ఉపాధి హామీ పనులు చేసే శ్రామికుల్లో 57.43% మంది మహిళలు ఉన్నారు.

సాధికార మహిళా రైతులు
వారి కుటుంబాలు, సమాజాల శ్రేయస్సుకు దోహదపడుతుంది. 

ఆహార కొరత తగ్గుతుంది.

అనేక రకాల ఆహారం, పౌష్టికాహారం మరింత మెరుగ్గా అందుతుంది. 

రైతు కుటుంబాల ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి.

రకరకాల ఒడొదుడుకులను తట్టుకునే శక్తి కుటుంబాలకు పెరుగుతుంది.  

(చదవండి: సేంద్రియ ఆహార మార్కెట్లకు చోటివ్వండి!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement