ఓ పక్క వణుకు పుట్టిస్తున్న చలి వాతావరణం.. మరోపక్క ఇండియా.. ఇండియా అంటూ హోరెత్తిన స్టేడియం.. ఈ కోలాహలం నడుమ విశ్వవిజేతలు విశాఖలో దండయాత్ర మొదలుపెట్టారు.
వన్డే ప్రపంచకప్ గెలిచిన జోష్‌ను కొనసాగిస్తూ, సొంతగడ్డపై జరిగిన తొలి పోరులోనే భారత మహిళా జట్టు సత్తా చాటింది.
ఆదివారం వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ల ఆట ఎలా ఉంటుందో ఆ జట్టుకు రుచి చూపించింది.
టాస్ గెలిచిన భారత్ బౌలింగ్‌లో సత్తా చాటింది.ఫీల్డింగ్‌లో కొన్ని క్యాచ్‌లు జారవిడిచినా,చురుగ్గా కదిలిన భారత ఫీల్డర్లు ముగ్గురు శ్రీలంక బ్యాటర్లను రనౌట్ చేసి పెవిలియన్‌కు పంపారు.
122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. దూకుడుగా ఆడి మరో 32 బంతులు మిగిలి ఉండగానే, కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయతీరానికి చేరింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన, వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్(69) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
మ్యాచ్‌ను వీక్షించేందుకు విశాఖ క్రీడాభిమానులు తరలివచ్చారు. ఓ పక్క చలి వాతావరణం ఉన్నప్పటికీ, కుటుంబాలతో సహా హాజరై మ్యాచ్‌ను ఆస్వాదించారు.
ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బ్రహ్మరథం పట్టారు.


