అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఇటీవల (డిసెంబర్ 13-15) గోట్ టూర్ పేరిట భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ టూర్ ఆధ్యాంతం అద్భుతంగా సాగింది. మెస్సీని చూసేందుకు లక్షల సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు.
ఈ పర్యటనలో మెస్సీ కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించాడు. ప్రతి చోటా మెస్సీకి అనూహ్యమైన ఆదరణ లభించింది. కోల్‌కతాలో 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మొత్తంగా చూస్తే భారత్‌లో మెస్సీ పర్యటన విజయవంతమైంది.
ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే మెస్సీ పర్యటనలో భారత స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రీకి అవమానం జరిగిందని ఫుట్‌బాల్ ప్రేమికులు వాపోతున్నారు. ముంబైలో జరిగిన ప్రొగ్రాంలో నిర్వహకులు ఛెత్రీ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని వారంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబైలోని జరిగిన కార్యక్రమంలో నిర్వహకులు ఛెత్రీని అస్సలు పట్టించుకోలేదు.
వీఐపీలంతా మెస్సీతో ఫోటోలకు ఫోజులిస్తుంటే, ఛెత్రీ మాత్రం తన వారి మధ్యే అనామకుడిలా స్టేజీ కింద నిల్చుండిపోయాడు. అంతర్జాతీయ స్థాయిలో నాలుగో టాప్ గోల్ స్కోరర్ అయిన ఛెత్రీని నిర్వహకులు మెస్సీ ఫోటో ఉన్న టీ షర్ట్ వేయించి మరింత అవమానించారు. అంతర్జాతీయ స్థాయిలో మెస్సీది, ఛెత్రీది ఇంచుమించు ఒకే స్థాయి. అయినా మెస్సీ ఏదో గొప్ప అయినట్లు అతని ఫోటోను మన హీరో ధరించిన టీ షర్ట్‌పై వేయించడం అవమానకరమని చాలామంది ఫీలవుతున్నారు.
ముంబై ప్రొగ్రామ్‌లో వీఐపీలంతా స్టేజీపై అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే ఛెత్రీ స్టేజీ కింద సామాన్యుడిలా అటు ఇటూ తిరుగుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది. ఈ వీడియోను చూసిన వారంతా ఛెత్రీకి అతని స్థాయి గౌరవం దక్కలేదని అభిప్రాయపడుతున్నారు.
మెస్సీ గొప్ప ఆటగాడే, అయినా మన దేశంలో ఫుట్‌బాల్ ఉనికిని కాపాడిన ఛెత్రీకి కూడా సమాంతర గౌరవం లభించాలన్నది వారి భావన. విదేశీయుల మోజులో పడి 20 ఏళ్లు భారత్‌లో ఫుట్‌బాల్ వ్యాప్తికి కృషి చేసిన మన హీరోని చిన్నచూపు చూడటం సమంజసం కాదని ప్రతి ఒక్కరి అభిప్రాయం.
నిర్వహకులు, పాలకులు సరైన గౌరవాన్ని ఇవ్వకపోయినా మెస్సీ మాత్రం ఛెత్రీ పట్ల చాలా మర్యాదగా ప్రవర్తించి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. మెస్సీ స్వయంగా ఛెత్రీని పలకరించి, హత్తుకుని, తన సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. ఈ దృశ్యం భారత ఫుట్‌బాల్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది.
భారత ఫుట్‌బాల్ దిగ్గజాన్ని నిర్వహకులు పట్టించుకోకపోయినా మెస్సీ మాత్రం సరైన రీతిలో గౌరవించాడని ఫ్యాన్స్ అంటున్నారు.
కాగా, అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాలర్ల జాబితాలో ఛెత్రీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో లాంటి దిగ్గజాలు మాత్రమే ఛెత్రీ కంటే కాస్త ముందున్నారు. 2024 జూన్‌లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఛెత్రీ 151 మ్యాచ్‌ల్లో 94 గోల్స్ చేసి ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గోల్ చేసిన ఆటగాళ్లలో ముఖ్యుడిగా నిలిచాడు.


